రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వేగంగా చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్.బి. అండ్. ఆర్) జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు.రామాయపట్నం పోర్టు భూసేకరణపై ప్రకాశం భవ నంలోని జె.సి. ఛాంబర్లో సంబ ంధిత అధికారులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినందున భూముల
కేటాయింపుల్లో మరింత వేగం పెంచాలని జె.సి. మురళి తెలిపారు. పోర్టు కోసం 323 ఎకరాల ప్రభుత్వ భూమిని, 220 ఎకరాల చుక్కల భూమిని, 43 ఎకరాల అసైన్డ్ భూమిని పోర్టు అధికారులకు అప్పగించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 45.94 ఎకరాల భూమి రామాయ పట్నం పోర్టుకోసం
ఇచ్చేశామని ఆయన స్పష్టం చేశారు. మరో 90 ఎకరాలు వారంరోజుల్లోగా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 220 ఎకరాల చుక్కల భూమిలో ప్రస్తుతం 180 ఎకరాలను 15 రోజుల్లోగా పోర్టు అధికారులకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని ఆయన వివరించారు. చేవూరు
గ్రామంలో 120 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం జరగనున్నందున ఇళ్లు, భూములు కోల్పోయిన వారికోసం రావులపాలెం, ఆవులవారిపాలెం గ్రామాలలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని జె.సి. మురళి చెప్పారు. నిర్వాసితులయ్యే 253 కుటుంబాలకు పునరావాస కాలనీ నిర్మించాల్సి ఉందన్నారు. ఆ
రెండు గ్రామాలలో సుమారుగా 40 నుంచి 50 ఎకరాలు భూసేకరణ చేయాలని సంబంధి త అధికారులను ఆదేశించారు. రామాయపట్నం పోర్టు పరిధిలోకి వచ్చే భూముల సేకరణలో 70 ఎకరాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించనున్నాయని ఆయన తెలిపారు. ఆ భూములలో ఐదేళ్ల క్రితం
నుంచి సాగుచేస్తున్న పెద్ద, చిన్న రైతుల వివరాలను గూగుల్ లోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారం తో గుర్తించాలన్నారు. అలా గుర్తించిన వారి వివరాలపై నివేదిక పంపాలన్నారు. నిర్వాసితులయ్యే బాధితుల గృహాలు, భూముల కొలతలు ఖచ్చితత్వంగా ఉండాలన్నారు. పరిహారం ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఆయన పలు సూచనలు చేశారు. పోర్టు పరిధిలోకి వచ్చే 44.4 ఎకరాలు అటవీ శాఖ ఆధీనంలో ఉన్నాయని ఆయన తెలిపారు. అక్కడ సాగుచేసుకుంటున్న వారికి ప్రత్యామ్నాయంగా పి.సి.పల్లి మండలం నేరేడుపల్లిలో 60 ఎకరాలు సాగుభూమి ఇవ్వడానికి అటవీ శాఖ సిద్దంగా ఉందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, డి.ఆర్.ఓ. తిప్పే నాయక్, ఆర్. అండ్. బి. ఎస్.ఇ. విజయరత్నం, ఉలవపాడు తహసిల్దార్ శిల్ప, పోర్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.