కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. నగరంలోని జోన్ 16వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. తల్లి తమ పిల్లలకు ప్రేమతో ఏ విధమైన సేవ చేస్తుందో అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది మన చెత్తను గాని కాలువలోని చెత్తను గాని తీస్తారని, అందుకే ప్రతి పారిశుద్ధ కార్మికులు తల్లిదండ్రులతో సమానమని, వారికి మనం ఎప్పుడూ ఋణపడి ఉంటామని, పారిశుద్ధ్య కార్మికులు ఎండనకా, వాననకా కష్ట పడతారని వారికి ప్రజలు సహకారం అందించాలని మేయర్ తెలిపారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆ వార్డులో మేయర్, వార్డు కార్పొరేటర్ తో కలసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొల్లి లక్ష్మి, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, ఎ.ఎం.ఒ.హెచ్ రమణ మూర్తి, శానిటరి సూపర్వైజర్ జనార్ధన్, శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.