పురోగ‌మిస్తున్న వైద్య ఆరోగ్య వ్య‌వ‌స్థ‌..


Ens Balu
5
Vizianagaram
2021-06-06 08:12:52

ప్ర‌జ‌ల సంక్షేమ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ధ్యేయంగా మారింది. ఒక‌వైపు వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూనే, విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల్లో పెద్ద ఎత్తున‌ మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఫ‌లితంగా ఆయా రంగాల్లో స‌మూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైద్యారోగ్య రంగం శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతోంది. ఒక్క విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనే సుమారు రూ.760.89 కోట్ల రూపాయ‌ల‌తో ఆసుప‌త్రుల ఆధునీక‌ర‌ణ‌, కొత్త ఆసుప‌త్రుల ఏర్పాటుకు కృషి జ‌రుగుతోంది. వైద్య సేవ‌లు ప్ర‌జ‌ల ముంగిట‌కే వ‌చ్చి చేరుతున్నాయి. వివిధ దీర్ఘ‌కాలిక రోగులు 5,178 మందికి పింఛ‌న్లు అందించి ఆదుకోవ‌డం జ‌రుగుతోంది. ఒక‌ప్పుడు కార్పొరేట్ ఆసుప‌త్రిలో వైద్య‌మంటే, సామాన్యుడికి ఊహ‌ల్లో కూడా లేని విష‌యం. ఈ ఆధునిక వైద్యాన్ని ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా పేద‌ల ద‌రికి చేర్చిన‌వారు దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. దానిని మ‌రింత చేరువచేసి, ప్ర‌జ‌ల ఆరోగ్యానికి భ‌రోసా క‌ల్పించారు ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అధికారంలోకి రాక‌ముందు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా సుమారు 1100 వ్యాధుల‌కు మాత్ర‌మే చికిత్స అంద‌గా, ప్ర‌స్తుతం వ్యాధుల సంఖ్య‌ను సుమారు 2,400 కు పెరిగింది. జిల్లాలో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి  6ల‌క్ష‌లా, 99వేల‌, 852 మంది అర్హులుగా ఉన్నారు. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు 35,972 మంది ఈ రెండేళ్ల కాలంలో ఆరోగ్య‌శ్రీ ద్వారా జిల్లాలోని 28 నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల్లో రూ.84.88 కోట్ల విలువైన వైద్య‌చికిత్సలు పొందారు. అవ‌స‌ర‌మైన వారికి ఆరోగ్య‌శ్రీ ద్వారా, పూర్తిగా ఉచితంగా చికిత్స‌ను అందించ‌డ‌మే కాకుండా, శ‌స్త్ర చికిత్స చేయించుకున్‌సవారు కోలుకొనే వ‌ర‌కూ , ఆరోగ్య ఆస‌రా ప‌థ‌కం ద్వారా వారికి రోజుకు రూ.225 చొప్పున‌,  నెల‌కు రూ.5వేలు వ‌ర‌కూ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది ప్ర‌భుత్వం. ఇలా ఈ రెండేళ్ల‌లో సుమారు 24,589 మంది ఆస‌రా ద్వారా 15 కోట్ల రూపాయ‌ల సాయాన్ని పొందారు.

ఆప‌ద్భాంధ‌వి 108
                 కుయ్ కుయ్ కుయ్.... అంటూ అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో వాలిపోయే 108 వాహనాలు జిల్లాలో విశేష‌మైన సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఆప‌త్కాలంలో బాధితుల‌కు ఆదుకొని, ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఇటీవ‌లే జిల్లాకు 108 వాహ‌నాలు 36 ను ప్ర‌భుత్వం కొత్త‌గా  స‌మ‌కూర్చింది. వీటిలో అడ్వాన్స్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 10, బేసిక్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 24, నియోనాట‌ల్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 2 ఉన్నాయి. వీటి ద్వారా సంఘ‌ట‌నా స్థ‌లానికి కేవ‌లం 20 నిమిషాల్లోనే వాహ‌నాలు చేరుకొని, క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి, వారి విలువైన ప్రాణాల‌ను నిల‌బెడుతున్నాయి.  ఈ వాహ‌నాల ద్వారా నెల‌కు సుమారుగా 3,500 నుంచి 4,500 మంది క్ష‌త‌గాత్రులు లేదా రోగులు లేదా గ‌ర్భిణుల‌ను ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 1700 మంది కోవిడ్ రోగుల‌ను  ఆసుప‌త్రుల‌కు చేర్చాయి.

ఈ ఏడాది 108 వాహ‌నాల ద్వారా త‌ర‌లించిన పేషెంట్లు
జ‌న‌వ‌రి    3,285
ఫిబ్ర‌వ‌రి   3,497
మార్చి      4,685
ఏప్రెల్    4,714
మే            4,100

గ్రామీణుల చెంత‌కు 104 వైద్యం
                నాణ్య‌మైన వైద్య సేవ‌ల‌ను సామాన్యుల  ద‌రిచేర్చ‌డానికి ప్ర‌భుత్వం ఎంత‌గానో కృషి చేస్తోంది.  పేద‌ల ముంగిట‌కే వైద్య సేవ‌ల‌ను అందించేందుకు 104 వాహ‌నాలు దోహ‌ద‌ప‌డుతున్నాయి. ఇవి గ్రామీణ వైద్యాల‌యాలుగా మారాయి. జిల్లాలో ప్రస్తుతం 33 వాహ‌నాలు సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఈ వాహ‌నాలు ద్వారా నెల‌కు స‌గ‌టున 30వేల మందికి వైద్యం అందుతోంది. కేవ‌లం వైద్య సేవ‌లే కాకుండా, దాదాపు 1800 ర‌కాల మందుల‌ను కూడా ఈ వాహానాల ద్వారా గ్రామీణ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు.

104 వాహ‌నాల ద్వారా అందించిన ఓపి వివ‌రాలు ః
జ‌న‌వ‌రి   22,961
ఫిబ్ర‌వ‌రి  29,770
మార్చి     34,743
ఏప్రెల్    33,158
మే           33,000

వైద్య క‌ళాశాల‌తో భ‌రోసా
               జిల్లాలో సుమారు రూ.500 కోట్ల నాడూ-నేడు నిధుల‌తో, 500 ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మితం కానుంది. విజ‌య‌న‌గ‌రం స‌మీపంలోని గాజుల‌రేగ వ‌ద్ద సుమారు 70 ఎక‌రాల్లో దీని నిర్మాణానికి ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శంకుస్థాప‌న చేశారు. 30 నెల‌ల్లో దీని నిర్మాణం పూర్తి చేసుకొని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది. ఫ‌లితంగా అన్ని ర‌క‌లా అధునాత‌న వైద్య సేవ‌లు జిల్లా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఇప్ప‌టిలా, విశాఖ కెజిహెచ్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

గిరిజ‌నుల చెంత‌నే ఆధునిక వైద్యం
               ఏజెన్సీకి ముఖ‌ద్వారం, డివిజ‌న్ కేంద్ర‌మైన పార్వ‌తీపురంలో మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి ఇప్ప‌టికే అంకురార్ప‌ణ జ‌రిగింది. సుమారు 5 ఎక‌రాల విస్తీర్ణంలో, రూ.49.26 కోట్ల వ్య‌యంతో దీని నిర్మాణానికి కొద్ది నెల‌ల క్రితం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శంకుస్థాప‌న చేశారు. టెండ‌ర్లు కూడా ఖ‌రార‌య్యాయి. ఈ ఆసుప‌త్రి నిర్మాణం పూర్త‌యితే, పార్వ‌తీపురం చుట్టుప్ర‌క్క‌ల మండ‌లాల ప్ర‌జ‌ల‌తోబాటు, 8 గిరిజ‌న మండ‌లాల్లోని గిరిపుత్రుల‌కు, ఒడిషా  రాష్ట్ర స‌రిహద్దు ప్ర‌జ‌ల‌కు కూడా ఈ ఆసుప‌త్రి సేవ‌లు అంద‌నున్నాయి.

వైఎస్ఆర్ కంటివెలుగు
               అవ్వాతాత‌ల క‌ళ్ల‌లో వెలుగు నింప‌డానికి, చిన్నారుల కంటి చూపు కాపాడ‌టానికి ప్ర‌భుత్వం వైఎస్ఆర్ కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం చేప‌ట్టింది. దీనిలో భాగంగా వృద్దులు, చిన్న‌పిల్ల‌ల‌ను ముందుగానే కంటి స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డానికి, కంటి ప‌రీక్ష‌ల‌ను మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించింది. మొద‌టి విడ‌త 2,92,462 మందికి ప్రాధ‌మిక‌ కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రెండో విడ‌త 12,991 మందికి కంటివ్యాధి నిపుణుల చేత 12,991 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, వారికి క‌ళ్ల‌ద్దాల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింది. మూడోవిడ‌త 48,130 మంది అవ్వాతాత‌ల‌కు కంటి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

స‌మ‌ర్థ‌వంతంగా కోవిడ్ క‌ట్ట‌డి
               ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడించిన కోవిడ్ మ‌హ‌మ్మారిని ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా, జిల్లాలో స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌డం జ‌రిగింది. దీనికోసం జిల్లాలో 27 కోవిడ్ ఆసుప‌త్రుల‌ను గుర్తించి, అవ‌స‌ర‌మైన‌ ఆక్సీజ‌న్‌, మందులును స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది. వీటిలో మొత్తం ప‌డ‌క‌లు 2608 కాగా, వీటిలో 463 ఆక్సీజ‌న్ ప‌డ‌క‌లు, 209 ఐసియు ప‌డ‌క‌లను ఏర్పాటు చేసి, చికిత్స‌ను అందించ‌డం జ‌రిగింది. జిల్లా కేంద్రాసుప‌త్రిలో హుటాహుటిన 10 కెఎల్ ఆక్సీజ‌న్ ట్యాంకును ఏర్పాటు చేసి, ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది.  సుమారు 2వేల మందికి ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా ఉచితంగా కోవిడ్ చికిత్స అందించ‌బ‌డింది.

మౌలిక వ‌స‌తుల‌కు పెద్ద‌పీట‌
                రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి అధికారంలోకి రాగానే, విద్య‌, వైద్య రంగాల్లో మౌలిక వ‌సతుల‌కు క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు. దీనిలో భాగంగా భారీ ఎత్తున వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బందిని నియ‌మించారు. జిల్లాలో నాడూ-నేడు, నాబార్డు, డిఎంఇ, ఎన్‌హెచ్ఎం త‌దిత‌ర నిధులు సుమారు రూ.760.89 కోట్ల‌తో ఆసుప‌త్రుల నిర్మాణం, అభివృద్ది కార్య‌క్ర‌మాలు జోరందుకున్నాయి. దీనిలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌, పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రితోపాబాటుగా, ప్ర‌స్తుతం ఉన్న పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లు నిర్మాణం, మ‌ర‌మ్మ‌తు కార్య‌క్రమాలు ఎపి వైద్య‌, ఆరోగ్య మౌలిక వ‌స‌తుల అభివృద్ది సంస్థ ఆధ్వ‌ర్యంలో చురుగ్గా  జ‌రుగుతున్నాయి. నాడూ-నేడు ప‌థ‌కం క్రింద జిల్లా వ్యాప్తంగా ఉన్న 68 ప్రాధ‌మిక వైద్య కేంద్రాలను రూ.48.24 కోట్ల‌తో కొత్త భ‌వ‌నాల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టారు. ఈ ప‌నుల‌ను ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ ప‌ర్య‌వేక్షిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 510 డాక్ట‌ర్ వైఎస్ఆర్ విలేజ్ క్లీనిక్కులు నిర్మాణం జ‌రుగుతోంది. సుమారు రూ.59.57 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మితం అవుతున్న వీటిని పంచాయితీరాజ్ శాఖ ప‌ర్య‌వేక్షిస్తోంది. వీటి నిర్మాణం పూర్తయితే, జిల్లాలోని వైద్యారంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటుచేసుకుంటాయి. ఇటు గ్రామ స్థాయి నుంచి అటు జిల్లా స్థాయి వ‌ర‌కూ మెరుగైన వైద్య‌ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.  

వైద్యులు, సిబ్బంది నియామ‌కం ః
                         రెండేళ్ల క్రితం        ఈ రెండేళ్ల‌లో నియామ‌కాలు
వైద్యులు               138                              40
న‌ర్సులు               128                             193
ఎఎన్ఎం               382                             598
ఇత‌ర సిబ్బంది     542                               89
ఆశా వ‌ర్క‌ర్లు         2542                              32
               

చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు ః
1) గ‌జ‌ప‌తిన‌గ‌రం సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ.1700 ల‌క్ష‌లు.
2) సాలూరు సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ.1700 ల‌క్ష‌లు.
3) ఎస్‌కోట‌ సిహెచ్‌సి 50 ప‌డ‌క‌ల నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ.1260 ల‌క్ష‌లు.
4) కురుపాం సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 300 ల‌క్ష‌లు.
5) బాడంగి సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 881 ల‌క్ష‌లు.
6) భ‌ద్ర‌గిరి సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 895 ల‌క్ష‌లు.
7) పార్వ‌తీపురం జిల్లా ఆసుప‌త్రి 100 ప‌డ‌క‌ల నుంచి 150 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 2115 ల‌క్ష‌లు.
8) నెల్లిమ‌ర్ల‌ 30 ప‌డ‌క‌ల సిహెచ్‌సి అభివృద్ది రూ. 442 ల‌క్ష‌లు.
9) భోగాపురం 30 ప‌డ‌క‌ల సిహెచ్‌సి అభివృద్ది రూ. 395 ల‌క్‌ాలు.
10) బొబ్బిలి సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 332 ల‌క్ష‌లు.
11) జిల్లా ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణం రూ.50000 ల‌క్ష‌లు.
12) పార్వ‌తీపురం మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణం రూ.4926 ల‌క్ష‌లు
13) డిఇఐసి-పార్వ‌తీపురం రూ.106ల‌క్ష‌లు
14) బ‌ర్త్ వెయిటింగ్ హోమ్‌, పార్వ‌తీపురం రూ.30ల‌క్ష‌లు
15) భ‌ర్త్ వెయిటింగ్ హోమ్‌, భ‌ద్ర‌గిరి, రూ.30ల‌క్ష‌లు
16) జిల్లా కేంద్రంలోని సెంట్ర‌ల్ డ్ర‌గ్ స్టోర్ అభివృద్ది రూ.196ల‌క్ష‌లు.


వైద్యారోగ్య రంగానికి వెచ్చించిన‌  నిధులు ః

నిధులు                                                ప‌నులు       వ్య‌యం(రూ. కోట్ల‌లో)

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల (నాడూ-నేడు)        1             500.00
నాబార్డు నిధులు                                           10             100.20
డిఎంఇ (పార్వ‌తీపురం మ‌ల్టీ స్పెషాలిటి)     1               49.26
నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్                                     4                 3.62
నాడూ.నేడు (పిహెచ్‌సిలు)                           68               48.24
నాడూ-నేడు (వెల్‌నెస్ సెంట‌ర్లు)               510               59.57
                                                                            మొత్తం 760.89 కోట్లు


మెరుగైన వైద్య స‌దుపాయాల‌ను కల్పిస్తున్నాం ః క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌
                   జిల్లా ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నాం. ప్ర‌స్తుతం సుమారు 760 కోట్ల రూపాయ‌ల‌తో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఎన్న‌డూ లేని విధంగా వైద్య రంగంలో ఖాలీల భ‌ర్తీ చేప‌ట్టాం. డాక్ట‌ర్ వైఎస్ఆర్ విలేజ్ క్లీనిక్కుల‌వ‌ల్ల గ్రామీణ ప్ర‌జ‌ల చెంత‌కే వైద్య సేవ‌లు అందుతాయి. జిల్లాలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణం పూర్త‌యితే, వైద్య సేవ‌ల‌కోసం ఇత‌ర జిల్లాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. వైద్య రంగంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా, వ‌స‌తులు పెరిగి, కోవిడ్‌ను జిల్లాలో స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నాం.