15నుంచి డెల్టాభూములకు సాగునీరు..
Ens Balu
2
Kakinada
2021-06-07 01:46:37
గోదావరి తూర్పు, పశ్చిమ డెల్టాల ఆయకట్టులకు జూన్ 15వ తేదీ నుంచి సాగునీరు విడుదల చేస్తామని, ఈ లోగా సాధ్యమైనన్ని క్లోజర్ వర్క్స్ పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. మంత్రి కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత నెల 27వ తేదీన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులతో తాను, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సంయుక్తంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి గోదావరి కాల్వలకు నీటి విడుదల, త్రాగునీటి ఎద్దడి నివారణ అంశాలపై సమీక్షించామన్నారు. సమావేశంలో గోదావరి డెల్టాలకు జూన్ 15 నుండి ఖరీఫ్ పంటలకు నీరు విడుదలకు నిర్ణయించామని తెలిపారు. గత నవంబరు నెలలో వచ్చిన నివర్ తుఫాను కారణంగా రెండు జిల్లాల్లో రైతులు పంటలు వేసుకోవడం ఆలస్యమైందని, అందువల్ల దాదాపు ఏప్రియల్ నెలాఖరు దాకా కాల్వలకు నీరు ఇవ్వవలసి వచ్చిందన్నారు. రైతుల పంటలకు నీటి ఎద్దడి రాకుండా కాపాడేందుకు ముఖ్యమంత్రి సీలేరు జలాలను పంటల అవసరాల కొరకు విడుదలకు ఆదేశించారన్నారు. అలాగే వేగంగా జరుగుతున్న పోలవరం కాపర్ డామ్ పనుల దృష్ట్టా అనుకున్న దాని కంటే అదనంగా కొద్ది రోజులు కాలువలకు నీటి విడుదల ఆలస్యమైందన్నారు. కాల్వల మూసివేత కాలం తక్కవ కావడం, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ రెండవ వేవ్ పరిస్థితుల కారణంగా మంజూరు చేసిన క్లోజర్ నిర్వహణ, అభివృద్ది పనులు ఆశించిన స్థాయిలో సాధ్యం కాలేదని, ముఖ్యమైన, అత్యవసరమైన పనులను ఈ నెల 15న కాలువలు తెరిచే లోపు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరిగేషన్ అధికారులను ఆదేశించామన్నారు. మిగిలి పోయిన పనులన్నిటినీ వచ్చే ఏడాది ప్రాధాన్యతగా చేపట్టి నూరు శాతం పూర్తి చేస్తామని తెలిపారు. కాలువలు తెరిచే లోపు రెండు జిల్లాల త్రాగునీటి అవసరాలపై సమీక్షలో తూర్పు గోదావరి జిల్లాలో క్లోజర్ కు ముందు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి స్థాయిలో నింపినందున త్రాగునీటికి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ తెలిపారని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ ఆవాసాల ప్రజలకు రవాణా ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని సూచించామన్నారు. కాలువలు తెరిచిన వెంటనే ఖరీఫ్ పంటలు చేపట్టేలా వ్యవసాయ శాఖ ద్వారా రైతులను సమాయత్తం చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు.