విజయనగరం జిల్లాలో మూడోదశ ముప్పు తప్పించేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తగిన కార్యాచరణ ప్రణాళికను తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు గానూ ముందస్తుగా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, థర్డ్‌వేవ్ వస్తుందన్న వైద్యనిపుణుల హెచ్చికల నేపథ్యంలో, దానిని ఎదుర్కొనడానికి తగిన ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో థర్డ్‌వేవ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేమని, అయినప్పటికీ మనమంతా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ మూడోదశ మొదలైన పక్షంలో, దానివల్ల కలిగే నష్టాలను వీలైనంతగా తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా థర్డ్ వేవ్ వస్తే, పిల్లలు ఎక్కువగా ప్రభావితులయ్యే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సిద్దం కావాలని సూచించారు. పిల్లల వయసు, ఆరోగ్యం, వారి మానసిక స్థితిని బట్టి మన కార్యాచరణ ఉండాలని అన్నారు. దీనికి అవసరమైన అవగాహనా కార్యక్రమాలు, నివారణా చర్యలు, వ్యాధి నిర్ధారణ, వ్యాధికి చికిత్స, అందుకు అవసరమైన నిపుణులకు శిక్షణ, రిపోర్టింగ్ తదితర అంశాలవారీగా, పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా, వేక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. కోవిడ్ పిల్లలకు రాకుండా ఉండాలంటే, వారి తల్లితండ్రులకు వేగంగా వేక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. కోవిడ్ మొదటి దశలో పెద్దలు ఎక్కువగా ప్రభావితులయ్యారని, రెండో దశలో వయసుతో సంబంధం లేకుండా యుక్తవయసు వారు కూడా వ్యాధి బారిన పడ్డారని చెప్పారు. ఆయా దశలను అదుపు చేసేందుకు వేర్వేరు ప్రణాళికలు, చికిత్సా పద్దతులు, నివారణా చర్యలను తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అందువల్ల, మూడోదశను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలూ, వైద్య నిపుణులు చర్చించి, సమగ్ర ప్రణాళికను సిద్దం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో రెండోదశలో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని అన్నారు. అయినప్పటికీ మూడోదశను దృష్టిలో పెట్టుకొని, అప్రమత్తంగా ఉండాలని, వారంలో కనీసం రెండుసార్లు జ్వరాల సర్వేను నిర్వహించాలని సూచించారు. ఈ సర్వేలో ప్రధానంగా పిల్లల ఆరోగ్య పరిస్థితిపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. సచివాలయాల వారీగా జాబితాలను తయారు చేయాలని, ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి, వేక్సినేషన్, కంటైన్‌మెంట్ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా విద్యాశాఖ, స్త్రీశిశు సంక్షేమశాఖలు క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, పిల్లలకు, తల్లితండ్రులకు తగిన అవగాహనా కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, థర్డ్ వేవ్ వల్ల పిల్లలకు వ్యాధి సోకితే, తల్లితండ్రులు ఎక్కువ ఆందోళన చెందే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, పిల్లలకు, తల్లితండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. పిల్లల వయసుకు తగ్గట్టుగా చికిత్సా విధానాన్ని కూడా రూపొందించాల్సి ఉంటుందని సూచించారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, పలువురు వైద్య నిపుణులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని, కోవిడ్ మూడోదశను ఎదుర్కొనేందుకు పలు సూచనలు చేశారు.