ఉద్యోగ జీవితం పరంగా విధుల నిర్వహణ ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం పరంగా ఉద్యోగులు తమతో పాటు వారి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కోవిడ్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 26న మరణించిన తాళ్లరేవు మండల వ్యవసాయ అధికారి (ఏవో) ఎ.సిరి సంతాప సభ సోమవారం కాకినాడలోని కృషిభవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కురసాల కన్నబాబు సిరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనిపట్ల అంకితభావం, రైతుల సమస్యలపై తక్షణం స్పందించి, పరిష్కారానికి కృషిచేసే మంచి మనస్తత్వం ఉన్న వ్యవసాయ అధికారి సిరి కోవిడ్ బారినపడి మరణించడం తీవ్ర బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం వెంటనే అందేలా చూస్తామని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వ్యవసాయ అధికారులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని.. అయితే విధి నిర్వహణ సమయంలో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ చాలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తొలివేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌లో ప్రతి కుటుంబంపైనా ఏదో ఒక రూపంలో కోవిడ్ ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కోవిడ్ కారణంగా రాష్ట్రంలో ఎనిమిది మంది వ్యవసాయ అధికారులను కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వెల్లడించారు. నిత్యం రైతులతో మమేకమవుతూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న తమను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించి, అందరికీ వ్యాక్సిన్ వేయాలని వ్యవసాయ అధికారులు చేసిన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజయ్‌కుమార్, ఏపీ వ్యవసాయ అధికారుల అసోసియేషన్ జిల్లా యూనిట్ ప్రెసిడెంట్ డీవీ కృష్ణ, కార్యదర్శి డి.అరుణ్, వైస్ ప్రెసిడెంట్ దుర్గ, వ్యవసాయ శాఖ డీడీలు మాధవరావు, నాగాచారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.