గ్రామ స్వరాజ్యం సాకారం లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యేలా కృషిచేస్తూ, గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి సర్పంచ్‌లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. సోమవారం కాకినాడ రమణయ్యపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో కాకినాడ గ్రామీణ మండల ప్రజాపరిషత్ సమీక్షా సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లు, ఆయా గ్రామాల పంచాయతీకార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశానికి మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి గ్రామ సర్పంచ్‌తో మాట్లాడి ఆయా గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన సర్పంచ్‌లకు అభినందనలు తెలియజేస్తున్నానని, ప్రజలకు సేవ చేసే విషయంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల పనితీరుపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. నేరుగా నగదును జమజేసే దాదాపు 22 పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో పూర్తి అప్రమత్తత అవసరమని సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాల శాశ్వత భవన నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని.. నిర్మాణాలు ప్రారంభం కానివాటి విషయంలో కారణాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఏ సహాయం కావాలన్నా తాను 24 గం. అందుబాటులో ఉంటానని మంత్రి వెల్లడించారు.
*ప్రతి అర్హునికీ పథకాలు అందాల్సిందే:*
ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హునికి అందేలా చూడాలని, లబ్ధిదారుని ఎంపికకు అర్హత ఒక్కటే ప్రాతిపదిక అని మంత్రి స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రెయిన్ల శుద్ధి, రహదారులు తదితరాల్లో పోటీతత్వంతో పనిచేసి ప్రతి గ్రామం నెం.1గా నిలిచేందుకు కృషిచేయాలని తద్వారా నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలపాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన సర్పంచ్‌లు, అధికారులను సత్కరించనున్నట్లు వెల్లడించారు. నాడు-నేడు రెండోదశకు సంబంధించిన పాఠశాలలను గుర్తించి, నివేదిక ఇవ్వాలన్నారు. తూరంగి నీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. మండల, గ్రామ వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ప్రస్తుతం కోవిడ్ విపత్తు నేపథ్యంలో మనల్ని మనం పరిరక్షించుకుంటూ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, అందరికీ వీలైనంత త్వరగా టీకా అందించాలనేది ముఖ్యమంత్రి ఆశయమని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. సమావేశం అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా మంత్రిని ప్రజాప్రతినిధులు, అధికారులు సత్కరించారు. అదే విధంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను మంత్రి కురసాల కన్నబాబు శాలువాలతో సత్కరించారు. సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ గీసాల శ్రీను, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, తహసీల్దార్ వి.మురళీకృష్ణ, ప్రత్యేక అధికారి పద్మశ్రీ, గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.