10వేల కోవిడ్ టెస్టులు చేయండి..


Ens Balu
2
Collector Office
2021-06-07 13:23:12

విశాఖ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం గావించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు తన ఛాంబరులో వైద్యాధికారులతో వ్యాక్సినేషన్, ఐసోలేషన్ కిట్స్, కోవిడ్ కేసులు, అసుపత్రులలో ఆరోగ్యశ్రీ అమలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రోజుకు 10 వేల కోవిడ్ పరీక్షల నిర్వహణను ప్రణాళికబద్దంగా, యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలన్నారు. ఈ విషయంపై వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు జారీ చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.సూర్యనారాయణను ఆదేశించారు. టెస్ట్ లు నిర్వహించిన తదుపరి  శాంపిల్స్ ల్యాబ్ కు 24 గంటలలోగా  చేరాలన్నారు. ఈ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. పాజిటివ్ కేసులు 20 శాతం మించి వస్తున్న మండలాలను గుర్తించాలన్నారు. జిల్లాలోని ప్రవేటు ఆసుపత్రులలో  కోవిడ్ కేసుల సంఖ్యపై  వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు.  ఆరోగ్యశ్రీ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్స్ పరిస్థితిపై చర్చించారు.  కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ. 1లక్ష చొప్పున జిల్లాలో 13 మంది పిల్లలకు వారి ఖాతాలో జమ గావించాలని అధికారులను ఆదేశించారు. 
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు - 2 పి.అరుణ్ బాబు, ఎ.ఎమ్.సి ప్రిన్సిపాల్ డా.సుధాకర్, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖాధికారి డా.సూర్యనారాయణ, ఎల్.డి.ఎమ్ తదితరులు పాల్గొన్నారు.