రిమ్స్ కు పూర్తిస్థాయి ఆక్సిజన్..
Ens Balu
2
Srikakulam
2021-06-07 13:48:20
శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో ఎన్.ఏ.సి.యల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. తొలుత అక్సిజన్ ప్లాంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజుతో కలిసి స్విచ్ ఆన్ చేసి ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించారు. సుమారు రూ.75 లక్షల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంటును టాటా కన్సల్టెన్సీ ఇంజినీరింగ్ విభాగం కేవలం 20రోజుల్లోనే పూర్తిచేయడం గమనార్హం. ఈ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభంతో రిమ్స్ ఖాతాలోకి మరో ఆక్సిజన్ ప్లాంట్ అదనంగా చేరింది. దీంతో నేటినుండి రిమ్స్ లో మరింత మంది రోగులకు ఆక్సిజన్ అందించే అవకాశం కలగనుంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నిమిషానికి సుమారు 800 లీటర్ల వరకు ఆక్సిజన్ అందించనుందని, అలాగే 94 శాతం వరకు ప్యూరిటీ కలిగిఉంటుందని రాష్ట్ర మంత్రులకు ఎన్.ఏ.సి.ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.వరదరాజులు వివరించారు. సుమారు రూ. 75 లక్షల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంటులో కొద్దిపాటి మార్పుల కొరకు దాదాపు రూ.30 లక్షలు వెచ్చించడం జరిగిందని మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, రిమ్స్ సూపరింటెండెంట్ డా. ఎ.కృష్ణమూర్తి, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.జె.కిశోర్, ఎన్.ఎ.సి.ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంజినీరింగ్ సిబ్బంది , బృందం తదితరులు పేర్కొన్నారు.