మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ 5వ జోన్ 53వ వార్డు పరిధిలోని మర్రిపాలెంలో సాయినగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. పిన్ పాయింట్ వారీగా సిబ్బందిని సర్దుబాటు చేయనందున శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పనికి నిర్దేశించిన పారిశుధ్య సిబ్బందిని అదే పనికి వినియోగించాలని ఒకరికి రెండు, మూడు పనులు చెప్పరాదని ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, రోడ్లను శుభ్రం చేసిన చిన్న చిన్న చెత్త కుప్పలను వెను వెంటనే తోలగించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని ఆదేశించారు. 24x7 మంచినీటి కొరకు తవ్విన రోడ్లను పూడ్చలేదని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే రోడ్లను రిపేరు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ సింహాచలం, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్, డిసిపి శిల్పి, ఎఎంఒహెచ్ రాజేష్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.