కరోనా సోకిన సమయంలో మంచి ఆహారం తీసుకుంటూ, కోవిడ్ తగ్గిన తరువాత కూడా బలమైన పోషక ఆహార పదార్ధాలను మరియు చిన్న పిల్లలు, చిన్న పిల్లల తల్లితండ్రులు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రెవిన్యూ కళ్యాణ మండపం నందు జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషక ఆహార ప్రదర్శన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ కోవిడ్ నుండి కోలుకున్న వారు ఆహారం మంచిగా తీసుకోవాలని మరియు చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఆకుకూరలు, పండ్లు, కోడి గ్రుడ్డు, అనేక రకాలైన పోషక విలువలు కలిగిన పదార్ధాలను అందివ్వడం వలన నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పోషకాహార ఆవశ్యకత గురించి మండలాల్లో, గ్రామాల్లో ఇదే విధమైన పోషకాహార ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. థర్డ్ వేవ్ వస్తుందన్న ఉహాగానాల నేపధ్యంలో చిన్న పిల్లల తల్లి తండ్రులు తగిన శ్రద్ధ వహించి జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలందరూ మంచి ఆహార అలవాట్లను అలవరచుకోవాలని, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వుండాలని ఆయన సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు.
సంయుక్త కలెక్టర్ పి. ప్రశాంతి ( సచివాలయాలు, అభివృద్ధి ) మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ కోవిడ్ సమయంలో గర్భవతులు, బాలింతలు, పసి పిల్లలు, చిన్న పిల్లలు కోవిడ్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ చిన్న పిల్లల ఇమ్యునిటి పెరిగేందుకు తీసుకోవలసిన ఆహార పదార్ధాలతో ప్రదర్శన పెట్టడం చాలా బాగుందన్నారు. సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి మాట్లాడుతూ కోవిడ్ రెండవ వేవ్ తగ్గుతున్న దశలో థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం ఉన్నందున చిన్న పిల్లల తల్లి తండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ట్రైనీ సహాయ కలెక్టర్ శుభం భన్సాల్ మాట్లాడుతూ అంగన్ వాడీ సెంటర్లు, సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు చిన్న పిల్లల తల్లితండ్రులకు కరోనా మహమ్మారీ పై ఎక్కువగా అవగాహన కల్పించాలన్నారు.
గుంటూరు ఆర్డిఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న పిల్లల కొరకు కోవిడ్ కేర్ కేంద్రం అడవి తక్కెళ్ళపాడు లో ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. జే. యాస్మిన్ మాట్లాడుతూ ఈ కోవిడ్ సమయంలో సమతుల్య ఆహార విటమిన్లు ఎక్కువగా తీసుకోవడం వలన కరోనా సోకిన వ్యక్తులు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. న్యూట్రిషియన్ అనేది అన్ని రకాల ఆహార పదార్ధాలలో ఉంటుందని గమనించాలన్నారు. గర్బవతులు, బాలింతలు, చిన్న పిల్లలు ఏ సమయంలో ఎలా తినాలి అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పిల్లలకు ఇష్టమైన రీతిలో మంచి బలమైన ఆహారాన్ని పెట్టాలన్నారు.
అనంతరం కోవిడ్ కు సంబంధించి చైల్డ్ రైట్స్ అడ్వేజరీ ఫౌండేషన్ సంస్థ స్టేట్ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రాన్సిస్ తంబి చిన్న పిల్లల ఆహార పదార్దాలపై రూపొందించిన బ్రోచర్ రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ బి. మనోరంజని, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి, సిపిడిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.