కోవిడ్–19 మూడవ వేవ్ లో ఎక్కువుగా పిల్లలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున చిన్నపిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లపై వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కోవిడ్–19 మూడవ వేవ్ ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతితో కలిసి వైద్యారోగ్యశాఖ అధికారులు, పిల్లల వైద్య నిపుణులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ సోకిన పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించటానికి పిడియాట్రిక్ వార్డులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులలో పిల్లలకు వైద్యసేవలు అందించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పిల్లల చికిత్సకు సంబంధించి సీహెచ్సీ, పీహెచ్సీతో పాటు అన్ని వైద్యశాలలోని నర్సింగ్ సిబ్బందికి, వైద్యులకు చిన్నపిల్లల వైద్యనిపుణులతో శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పిల్లలకు వైద్యచికిత్సకు వినియోగించాల్సిన మందులు, పరికరాలు, బయోమెడికల్ ఎక్విప్మెంట్ పై వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు అందిస్తే వైద్యనిపుణుల కమిటీలో చర్చించి ప్రభుత్వానికి పంపుతామన్నారు.
రాష్ట్ర పిడియాట్రిక్స్ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు డా. చంద్రశేఖర్ రెడ్డి ధర్డ్ వేవ్లో కరోనా వైరస్ బారిన పడే పిల్లలకు అందించాల్సిన వైద్యచికిత్సలు, నివారణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డా. యాస్మిన్, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూరింటెండెంట్ డా. ప్రభావతి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ డా. కళ్యాణ్ చక్రవర్తి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల పీడియాట్రిక్స్ విభాగం హెచ్వోడీలు పాల్గొన్నారు.