ల్యాండ్ సెటిల్ మెంట్ వేగవంతం కావాలి..


Ens Balu
1
Guntur
2021-06-07 15:14:41

గుంటూరు జిల్లాలోని వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ శాఖ నుంచి తీసుకునే భూములకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూములు  అందించే ప్రక్రియ  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వరికపూడి సెల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ అంశంపై వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ ( రెవెన్యూ, రైతు భరోసా) ఏ.ఎస్. దినేష్ కుమార్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరికపూడి సెల ప్రాజెక్ట్  నిర్మాణానికి రూ.340 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. త్వరిత గతిన వరికపూడి సెల నీటిప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అటవీశాఖ నుంచి సుమారు 50 ఎకరాల భూములను తీసుకోవాల్సి ఉందన్నారు. దీనికి ప్రత్యాన్మాయంగా ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి అటవీశాఖకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని  రెవెన్యూశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల  గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఏఏ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించారని రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి బొల్లాపల్లి, వెల్ధుర్తి రెవెన్యూ  అధికారులతో మాట్లాడారు. 
కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్( రెవెన్యూ, రైతు భరోసా) ఏ.ఎస్.దినేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశామని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో భూముల గుర్తింపు కార్యక్రమాలను చేపట్టామన్నారు. త్వరితగతిన గుర్తించిన  రెవెన్యూ భూములను అటవీశాఖ అధికారులకు చూపించి, అధికారులు సమ్మతిస్తే సర్వే చేయిస్తామన్నారు. అవసరమైతే అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయ పరుచుకొని త్వరతిగతిన భూములను అటవీశాఖ అధికారులకు అప్పగించే  ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. వచ్చే వారంలో మరోసారి సమావేశం నిర్వహించి పనుల వేగాన్ని పెంచి భూములను అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.  
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్.ఇ  బాబురావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, మార్కాపురం డి.ఎఫ్.వొ బబిత, గుంటూరు డి.ఎఫ్.వొ రామచంద్రరావు, గురజాల ఆర్.డి.వొ. పార్ధ సారధి, నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, బొల్లాపల్లి,వెల్దుర్తి తహాశీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.