ఆ 2180 ఎకరాల భూమి రైతులకే..


Ens Balu
1
Kakinada
2021-06-07 15:17:41

రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మ నిర్ణయాని కనుగుణంగా కాకినాడ ఎఈజడ్ లో సేకరించిన 2180 ఎకరాల భూములను తిరిగి రైతులకు వెనుకకు ఇచ్చి రిజిష్ట్రేషన్ చేసే ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం  ఆయన, రాష్ట్ర ప్రభుత్వ  పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వల్లవన్ తో కలిసి సంయుక్తంగా  జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, కెఎస్ఈజడ్ ప్రతినిధులు, రైతులతో కలెక్టరేట్ వివేకానంద హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించి  కాకినాడ ఎస్ఈజడ్ లో సేకరించిన 2180 ఎకరాల భూములను  రైతులకు తిరిగి ఇచ్చే ప్రక్రియ పురోగతిని సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి  కన్నబాబు మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్ఈజడ్ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇచ్చే బోల్డ్ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గైకొన్నారని, దేశంలో ఎస్ఈజడ్ భూములకు సంబంధించి ఎదురైయ్యే సమస్యల పరిష్కారానికి మిగిలిన రాష్ట్రాలు ఈ నిర్ణయాన్నే అనుసరణీంగా స్వీకరిస్తున్నాయన్నారు.    కెఎస్ఈజడ్ లో 2180 ఎకరాల భూములను రైతులకు తిరిగి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ జీఓ అంశాలను త్వరితగతిన అమలు పరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు.  ఈ మేరకు ఇప్పటికే యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో గ్రామ సభలు నిర్వహించి వెనుకకు తిరిగి ఇవ్వాల్సిన భూములను గుర్తించడం జరిగిందన్నారు.  మొత్తం 2180 ఎకరాల విస్తీర్ణానికి గాను 1357 ఎకరాలను ఎవరి భూములను వారికే ఇంచేందుకు గుర్తించగా,  కెఎస్ఈజడ్ లో పరిశ్రమల స్థాపనకు అనువుగా భూమి ఒకే చోట ఏక ఖండంగా ఉండేందుకు వీలుగా, మరో 823 ఎకరాల భూములకు ప్రత్యామ్నాయంగా మరోక చోట భూములను గుర్తించారన్నారు.  ఈ భూములను వచ్చే అవార్డు లిస్ట్ ల ప్రకారం సేకరించిన రైతులకు వెనుకకు ఇస్తూ రిజిష్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని మంగళవారం నుండి ప్రారంభించాలని మంత్రి అధికారులకు, కెఎస్ఈజడ్ ప్రతినిధులకు సూచించారు.  రైతులకు వెనుకకు ఇస్తున్న భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియకు స్టాంపు డ్యూటీ లేకుండా ఉచితంగా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందని ఆయన తెలిపారు.  స్థానిక ప్రజల కోరిక మేరకు శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురంలోని కొంత భాగం ఆవాసాలను కెఎస్ఈ జడ్ పరిధిలో నుండి మినహాయించడం జరిగిందని, అలాగే ఆవాసాలకు దగ్గరగా ఉన్న స్మశాన వాటికలను కూడా యధతధంగా కొనసాగించాలని నిర్ణయించామన్నారు.  కెఎస్ఈజడ్ భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణకు పోలీస్ సూపరింటెండెంట్ కు సూచించడం జరిగిందన్నారు.  స్థానికులకే కెఎస్ఈజడ్ పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు కల్పించేందుకు స్కిల్ డెవలెప్ మెంట్ శిక్షణా కేంద్రాన్ని ములపేటలో నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కెఎస్ఈ జడ్ ను కోరామన్నారు.   అలాగే తొండంగి మండలం కోనలో సేకరించిన 657 ఎకరాల  అస్సైన్డ్ భూములకు పరిహారం తీసుకోని ఎస్తైనీలకు ఎకరాకు 5 లక్షల అదనపు పరిహారంతో వెరసి 10 లక్షల పరిహారం పంపిణీ ప్రక్రియను కూడా రెవెన్యూ అధికారుల సమన్వయంతో వచ్చే పక్షం రోజుల్లో పూర్తి చేయాలని  కెఎస్ఈజడ్ ప్రతినిధులను మంత్రి కన్నబాబు సూచించారు. 
  పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వల్లవెన్ సమావేశంలో మాట్లాడూతూ రైతులకు  తిరిగి ఇచ్చే 1357 ఎకరాల అవే భూములు, 823 ఎకరాల ప్రత్నామ్నాయ భూముల రిజిష్ట్రేషన్, కోన అసైన్డ్ భూములకు అదనపు పరిహారం చెల్లింపు ప్రక్రియలను రేపటి నుండే ముమ్మరంగా నిర్వహించాలని రెవెన్యూ, కెఎస్ఈజడ్ అధికారులను ఆదేశించారు.   ఈ ప్రక్రియలను 2007 నాటి అవార్డులను, ఒరిజినల్ అస్సైనీల సమాచారాన్ని ప్రాతిపదికగా చేపట్టి ముందుగా ఎటువంటి అభ్యంతరాలు లేని కేసులను వెంటనే పూర్తి చేయాలని, అభ్యంతరాలు వ్యక్తమైన వాటిపై మరో మారు క్షేత్ర పరిశీలన నిర్వహించి పరిష్కరిచాలని ఆయన సూచించారు.  రైతుల భూముల్లో ఫలసాయం ఇస్తున్న చెట్లకు కూడా ఉద్యానవన శాఖ నిర్ణయించిన విలువ ప్రకారం పరిహారం అందించడం జరుగుతుందన్నారు.    
సమావేశంలో రైతు ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలను  జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి నివృత్తి చేస్తూ భూసేకరణలో అవార్డు పాసై, గజెట్ లో ప్రకటించిన భూములు ప్రభుత్వ భూములుగా పరిగణింప బడతాయని, వాటిని తిరిగి వెనుకకు రిజిష్టరు చేయడం వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావవని స్పష్టం చేశారు. రేపటి నుండి నిర్వహించే రిజిష్ట్రేషన్ కార్యక్రమాలపై ఆయా గ్రామాల్లో టాంటాం, వలంటీర్లు, మాద్యమాల ద్వారా రైతులకు సమాచారం అందించాలని తహశిల్దారులను ఆదేశించారు.  
కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ రైతు సంక్షేమ దృక్పధంతో రాష్ట్ర ప్రభుత్వం గైకొన్న ఈ నిర్ణయానికి పట్టువిడుపులను పాటిస్తూ భూములిచ్చిన రైతులందరూ సహకరిచాలని  కోరారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ,  డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, కాకినాడ ఆర్డిఓ ఎ.జి.చిన్నికృష్ణ, కెఎస్ఈజడ్ ఎస్డిసి కె.మనోరమ, కెఎస్ఈజడ్ ప్రోజెక్ట్ హెడ్ బి.హెచ్.ఎ.రామరాజు, జియం సి.ఆర్.ఎం.నాయుడు,  తొండంగి తహశిల్దారు చిన్నారావు, యు.కొత్తపల్లి తహశిల్దారు శివకుమార్, పరిశ్రమలు, ఎపిఐఐసి, కాలుష్యనియంత్రణ, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.