మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ఇంటి స్థలాలు కేటాయించే ప్రక్రియను వేగంగా చేపట్టాలని జిల్లా స ంయుక్త కలెక్టర్ (ఆర్.బి. అండ్. ఆర్.) జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి, రెవిన్యూ అధికారులతో సోమవారం ప్రకాశం భవనంలోని జె.సి. ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. మధ్యతరగతి కుటుంబాలకు చవకగా ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందని జె.సి. మురళి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల పరిధిలో నివాసముంటున్న 20,509 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు పట్టణాల పరిధిలో ఈ పథకానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. పట్టణాలలో అవి లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా అసైన్ఢ్‌మెంట్ భూములు గుర్తించాలన్నారు. ఆ భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారినుంచి భూసేకరణ చేయాలన్నారు. మధ్యతరగతి కుటుంబాల వారికి భారం లేకుండా చూడటమే పథకం ముఖ్య ఉద్థేశ్యమన్నారు. తక్కువ ధరకే భూమి కేటాయించేలా ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఒంగోలు, మార్కాపురం, కందుకూరు ప్రాంతాలలో గుర్తించిన భూముల లేఅవుట్లను ఆయన పరిశీలించారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఒంగోలు, మార్కాపురం ఆర్.డి.ఓ.లు ప్రభాకర రెడ్డి, ఎమ్.వి. శేషిరెడ్డి, ఉడా వైస్ ఛైర్మన్ పి. భవాని ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.