పెండింగ్ అర్జీలు పరిష్కరించండి..
Ens Balu
2
GVMC office
2021-06-07 16:14:31
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పెండింగులో ఉన్న అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె తమ ఛాంబరు నుంచి జివిఎంసి ఉన్నతాధికారులతోను, అందరు జోనల్ కమిషనర్లతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాస్త్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిపాలన, సంక్షేమం ప్రతీ పేదవాడికి అందాలనే ఉద్దేశ్యంతో వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, దీనిని బలోపేతం చేయాలన్నారు. ప్రజలు పెట్టుకునే అర్జీలను పెండింగు లేకుండా వెంట వెంటనే పరిష్కరించాలని, అర్జీలు ఎ స్థాయి అధికారి వద్ద పెండింగు ఉన్నాయో ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగులో ఉన్న జగనన్న చేయూత, వాహన మిత్ర, జగనన్న తోడు తోపాటు, పింఛను పధకం, రైసు కార్డులు, ఇళ్ళ స్థలాలు మొదలైన అర్జీలు సాయంత్రానికి పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. స్పందనలో ట్విట్టర్ లాంటి సాంఘిక మాధ్యమాల ద్వారా వచ్చిన అర్జీలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని, పారిశుధ్యం, వీధి దీపాలు, మొక్కలు విభాగం, రెవెన్యూ మొదలైన విభాగాల అర్జీలు పెండింగులో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్డు సచివాలయ కార్యదర్శులు ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం పూర్తి అయిందని, ఇంకా వారి సర్వీసు రిజిస్టరు తెరవక పోవడంపై కమిషనర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రానికి అందరి సర్వీసు రిజిస్టర్లు తెరవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, ఎ.వి.రమణి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన ఇంజినీరు పి. రవి కృష్ణ రాజు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, యుసిడి. (పి.డి.) వై.శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులు, అందరు జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.