కోవిడ్ లో దాతల సహాయమే ముఖ్యం..
Ens Balu
2
Srikakulam
2021-06-07 16:44:14
కోవిడ్ వంటి విపత్కరమైన తరుణంలో పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి పి. కొండయ్య పేర్కొన్నారు. సోమవారం గుంటూరు భారతీయ విద్యా భవన్ ఆవరణలో సుమారు 50 కుటుంబాల పేద కళాకారులు, అర్చకులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వలన ఎంతోమందికి ఆరోగ్యం దెబ్బతిందని అన్నారు. పనులు లేక చాలామంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కష్ట కాలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నిర్వాహకులు ఆపదలో ఉన్న ఒక్కో కుటుంబానికి 10 కేజిల బియ్యం, ఒక్కోకేజి చొప్పున కందిపప్పు, నూనె, చింతపండు,గోదుమ పిండి, గోదుమరవ్వ, పంచదారలను 50 కుటుంబాలకు పంపిణీ చేశారు. మొత్తం 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి సన్నద్ధం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఉపాధ్యక్షులు రామచంద్ర రాజు, కోశాధికారి రవి శ్రీనివాస్, సినీ,నాటక రంగ నటులు, నంది అవార్డు గ్రహీత నాయుడు గోపి, సాహితీ సమాఖ్య కార్యదర్శి ఎస్.వి.ఎస్. లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ మహ్మమారి త్వరిత గతిన తగ్గిపోవాలని కోరుకుంటున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. కోవిడ్ కారణంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూను విధించిన నేపథ్యంలో పనులు లేక కళాకారులు,అర్చకులు పస్తులుంటున్నారు. దీంతో కళాకారులు, అర్చకులు జీవన విధానం కష్టతరమై పోతుందని గ్రహించిన దాతలు రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రెడ్ క్రాస్ సొసైటి ప్రతినిధులు వెల్లడించారు. అర్చకులు, పేదకళాకారులకు ఎంతో కొంత సాయంచేసి ఆదుకోవాలన్న దృక్పదంతో ముందుకు వచ్చిన దాతలకు రెడ్ క్రాస్ సొసైటి వైస్ ఛైర్మన్ రామచంద్రరాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటి ప్రతినిధులతో పాటుగా సినీ,నాటక రంగ నటులు, నంది అవార్డు గ్రహీత నాయుడు గోపి, సాహితీ సమాఖ్య కార్యదర్శి ఎస్.వి.ఎస్. లక్ష్మీ నారాయణ లు పాల్గొని రెడ్ క్రాస్ సొసైటి సేవలను కొనియాడారు.