కృష్ణా జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళుతున్న జె నివాస్ కు సోమవారం వివిధ ఉద్యోగ సంఘాలు ఘనంగా సత్కరించాయి. జిల్లా రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీతి, న్యాయాన్ని నిలబెట్టాలన్నారు. బాధ్యతను అప్పగించారు అంటే మీ మీద నమ్మకంతో ఇచ్చారని భావించాలన్నారు. కోవిడ్ సమయంలో వలసల నుండి వచ్చిన వారిని క్వారంటీన్ లో విజయవంతంగా చేసారని చెప్పారు. ప్రతి ఉద్యోగిని నమ్మానని ఆయన తెలిపారు. బృందంగా పనిచేసామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అన్ని విషయాల్లో ముందుండాలని ఆలోచించానని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయడానికి, ఇళ్ల పట్టాల పంపిణీలో చక్కటి ప్రణాళికలు రూపొందించి విజయవంతం చేశారన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి హృదయాలను టచ్ చేశారన్నారు. కోవిడ్ లో ప్రజలు ఇళ్లలో ఉన్నారు - మీరు రోడ్డు మీద ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి మాట్లాడుతూ మానవత్వం కలిగిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నారు. కోవిడ్ లో అనేక కొత్త విధానాలు జిల్లాలో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షులు ఎం. కాళీప్రసాద్ మాట్లాడుతూ విధులు నిర్వహణలో దిశానిర్దేశం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో శాయశక్తులా కృషి చేసి సఫలీకృతం అయ్యారని పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల పట్ల ప్రాణదాతగా నిలిచారని ప్రశంసించారు.
రెవెన్యూ డివిజనల్ అధికారులు ఐ. కిషోర్, టివిఎస్ జి కుమార్, ఎస్డీసిలు బి.శాంతి, పి.అప్పారావు, సీతారామయ్య,టి. సవరమ్మ, పౌర సరఫరాల సంస్థ డిఎం ఎన్. నరేంద్ర బాబు, డీఎస్ ఓ డి.వి.రమణ, తహసీల్దార్లు మాట్లాడుతూ విధులు నిర్వహణలో వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు. మహిళా అధికారులను ప్రోత్సహించి సమాజంలో మంచి గౌరవం పొందే విధంగా తోడ్పాటును అందించారని పేర్కొన్నారు. ప్రణాళికా బద్ధంగా మార్గదర్శకం వహించారని కొనియాడారు. మానవత్వానికి మారుపేరు నివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.