జగనన్నతోడు తో చిరు వ్యాపారులకు ప్రోత్సాహం..


Ens Balu
1
Vizianagaram
2021-06-08 08:20:10

జగనన్న తోడు తో జిల్లాలోని చిరువ్యా పారులకు, సంప్రదాయ, చేతి వృత్తి కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవాహర్ లాల్ తెలిపారు. జగనన్న తోడు రెండవ విడత  కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వెలగ పూడి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  తోడు క్రింద మొదటి విడత లో  స్త్రీ నిధి, స్వా నిధి క్రింద మొత్తం  23,961 మందికి 23.96 కోట్ల రూపాయల లబ్ధి అందగా రెండవ విడత క్రింద 22,086 మంది  లబ్ధి దారులకు 22.08 కోట్ల రూపాయలు  రుణాలుగా అందజేయడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమానికి జిల్లా నుండి ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, మున్సిపల్ , పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్,  శాసన మండలి సభ్యులు డా. సురేశ్ బాబు, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, బడ్డు కొండ అప్పల నాయుడు, శంబంగి వెంకట చిన్న అప్పల  నాయుడు, అలజంగి జోగా రావు,  సంయుక్త కలెక్టర్ డా. మహేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వి.సి. అనంతరం జిల్లా లబ్ధి దారులకు చెక్కును, గుర్తింపు కార్డులను  అందజేశారు. 
పాద యాత్రలో చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని చేస్తున్నారు:   జగనన్న తోడు లబ్ధిదారు గడి జ్యోతి 
పాదయాత్ర లో తమ వెంట పాల్గొన్నాను, మీరు ఇచ్చిన హామీలన్నీ చేయడం అసాధ్యం అనుకున్నాను.. కానీ అన్నిటిని గుర్తు పెట్టుకుని  మీరు చేసి చూపిస్తున్నారు.. లబ్ధి దారులకు జల్లెడ పట్టి, గుర్తించి, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని భావోద్వేగం తో చెప్పారు గడి జ్యోతి.    ఎస్.కోట మండలం భవాని నగర్ కు చెందిన ఈమె ముఖ్యమంత్రి తో  వీడియొ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.   తను కూరగాయల వ్యాపారం చేస్తోందని, 100 రూపాయలు వాడితే వడ్డీ తో కలిపి  150 రూపాయలు సాయంత్రానికి కట్టవలసి వచ్చేదని,   తన లాంటి వాళ్ళకు వడ్డీ భారం లేకుండా తోడు అమలు చేసి మంచి పని చేశారని ముఖ్యమంత్రిని కొనియాడారు.  ముఖ్యమంత్రి తండ్రి గారు స్వర్గీయ రాజ శేఖర్ రెడ్డి గారు పావలా  వడ్డీకి ఇచ్చిన రుణాలను తీసుకున్నామని, ఇప్పుడు సున్నా వడ్డీ ని అందజేసి తండ్రిని మించిన తనయునిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని  పనులు సుళువుగా జరుగుతున్నాయని, గతం లో ఎం.ఆర్.ఓ కార్యాలయాల చుట్టూ పనుల కోసం తిరిగే వాళ్ళమని తెలిపారు.  వై.ఎస్.ఆర్ పెన్షన్, ఆసరా, ఇళ్ల స్థలం, అమ్మ వొడి,  ఇలా అనేక పధకాలతో తాను ఒక్క సంవత్సరం లో 84 వేల రూపాయల  లబ్ధి పొందినట్లు వివరించారు. కరోనా వలన  ప్రభుత్వానికి ఆదాయం లేకపోయిన  వెయ్యి రూపాయలతో పాటు  తమకు ఉచిత రేషన్  అందజేశారని, నాణ్యమైన బియ్యాన్ని అందించారని తెలిపారు. రెండేళ్లలో ఇన్ని కార్యక్రమాలు చేశారు,  ఐదేళ్లలో మరెంతో చేస్తారని ఆశిస్తున్నామని, మా తరానికే కాదు, మా పిల్లల తరానికి కూడా మీరే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నామని  అన్నారు.