జగనన్న తోడు పథకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో రెండోవిడతలో మొత్తం 33,445 మంది లబ్ధిదారులకు రూ.33.45 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న తోడు పథకం కింద రెండో విడతలో 3,70,458 మందికి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.370 కోట్ల వడ్డీలేని రుణాలను బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ; ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి; జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో జగనన్న తోడు కింద ఇప్పటికే లబ్ధిపొంది విజయవంతంగా చిరువ్యాపారాలు నిర్వహిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు పండూరు పచ్చళ్లు, ఉప్పాడ చీరలు, వెదురు ఉత్పత్తులు వంటి వాటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలో పథకం అమలుతీరు వివరాలను కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు.
గ్రామీణప్రాంతాల్లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో స్త్రీనిధి ద్వారా మొత్తం 23,241 మంది లబ్ధిదారులకు రూ.23 కోట్ల 24 లక్షల పదివేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధితో డీసీసీబీ ద్వారా 10,204 మంది లబ్ధిదారులకు రూ.10 కోట్ల 20 లక్షల 40 వేల రూపాయలు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. ఎస్‌సీ కేటగిరీలో 7,375 మంది, ఎస్‌టీ కేటగిరీలో 1,388 మంది, బీసీ కేటగిరీలో 14,044 మంది, ఓసీ కేటగిరీలో 9,978 మంది, మైనారిటీ కేటగిరీలో 660 మంది లబ్ధిపొందినట్లు తెలిపారు. జగనన్న తోడు పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 వేల చొప్పున బ్యాంకు ద్వారా అందుతున్న వడ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు పెద్ద ప్రయోజనం కలిగిస్తున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, డీసీసీబీ సీఈవో పి.ప్రవీణ్‌కుమార్, స్త్రీనిధి ఏజీఎం ఎం.ధర్మేంద్ర, వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు, అధికారులు హాజరయ్యారు.