ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వితరణ..
Ens Balu
2
jntu Kakinada
2021-06-08 10:34:49
కాకినాడ జేఎన్‌టీయూలోని కోవిడ్ కేర్ కేంద్రంలో రోగుల కోసం రూ.6 లక్షలతో కొనుగోలు చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య పరికరాలను జేఎన్‌టీయూ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీ రమణ.. మంగళవారం వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరికి అందించారు. సామాజిక బాధ్యతగా కోవిడ్ రోగులకు చికిత్సలో అవసరమయ్యే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య పరికరాలను అందించిన ప్రొఫెసర్ కేవీ రమణను కలెక్టర్, జేసీ అభినందించారు. ఇప్పటికే ప్రొఫెసర్ రమణ రూ.5 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించారని తెలిపారు. తాను సొంతంగా రూ.లక్షా 25 వేలు, యూసీఈకేలో 1984లో ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న సహచరుల ద్వారా రూ.10 లక్షలు విరాళాలు సేకరించి.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, డయాబెటిక్ టెస్టింగ్ కిట్లు వంటివాటిని జిల్లాకు అందజేసినట్లు ప్రొఫెసర్ కేవీ రమణ తెలిపారు. కోవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సీసీసీ ఆర్ఎంవో డా. ఆర్.సుదర్శన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.