జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి..


Ens Balu
3
Srikakulam
2021-06-08 10:56:18

శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ ప్రోజెక్టులు చాలావరకు ఉన్నాయని వాటికి ప్రాధాన్యతను ఇస్తామని, అలాగే అధికారుల సహకారంతో ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలుచేస్తూ జిల్లా  సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తానని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాఠకర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబరులో నూతన జిల్లా కలెక్టర్ గా విధుల్లోకి చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రతో తనకు చాలా అనుభవం , అనుబంధం ఉందని, తాను విజయనగరం జిల్లాలో దాదాపు మూడేళ్ల  పాటు పనిచేసినట్లు  చెప్పారు.జిల్లాలో గత మూడు మాసాలుగా కోవిడ్ సెకెండ్ వేవ్ నియంత్రణకై జిల్లా యంత్రాంగం,  జిల్లా అధికారులు చాలా కష్టపడి పనిచేసారని,  ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. మరో నెలరోజుల పాటు కరోనా సెకెండ్ వేవ్ ఉండే అవకాశం ఉన్నందున కరోనా  నియంత్రణకు ప్రాధాన్యతను ఇస్తూ అందరి అధికారుల సహకారంతో కోవిడ్ ను  పూర్తిగా నియంత్రించేందుకు కృషిచేస్తామని తెలిపారు. కరోనాపై రాష్ట్ర ముఖ్యమంత్రి వారంలో రెండు, మూడు సార్లు వీడియోకాన్ఫరెన్సులను నిర్వహిస్తున్నారని, అలాగే జిల్లా కలెక్టర్లు అధికారులతో ప్రతీ రోజూ సమావేశాలను ఏర్పాటుచేస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలు, ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు ముందుకు సాగుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.  వ్యవసాయపరంగా జూన్ మొదటివారంలో ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అయినందున , జిల్లాలో అన్ని చోట్ల సాగు ప్రారంభం అవుతున్నందన వ్యవసాయానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 30 లక్షల గృహనిర్మాణాల కొరకు ప్రత్యేకంగా సంయుక్త కలెక్టర్(హౌసింగ్) ను ప్రభుత్వం ఇటీవల నియమించడం జరిగిందని, జిల్లాలో గృహపట్టాలు పొందిన లబ్ధిదారులకు గృహాలను నిర్మించి అప్పగించడం పెద్ద టాస్క్ అని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషిచేస్తామని కలెక్టర్ వివరించారు.

శ్రీకాకుళం జిల్లాకు రావడం తనకు ఆనందంగా ఉందని, ఇక్కడ చాలా మంచి అధికారులు పనిచేసారని, మంచి అధికారులు కూడా ఉన్నారని వారందరి సహకారంతో దేశ, రాష్ట్ర, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తొలుత సంయుక్త కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి నూతన కలెక్టర్ కు పుష్పగుచ్ఛాలను ఇచ్చి ఘన స్వాగతం పలికారు.  అనంతరం   శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వేదపండితులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం పలుకగా, ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాశ్ పుష్పగుచ్ఛం, దుశ్శాలువతో నూతన కలెక్టర్ కు సత్కరించి స్వామి వారి ప్రసాదాలను అందించారు.