జగనన్న తోడు పథకం కింద రెండవ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరువ్యాపారుల ఖాతాలలో రూ. 10వేల చొప్పున రూ. 370 కోట్లను విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలలో నగదు జమ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోపుడు బండ్లపై, బుట్టల్లో సరుకులు అమ్మేవారు, పుట్ పాత్ లపై వ్యాపారుల చేసేవారు , సైకిల్ , వాహనాలపై వస్తువులు అమ్మేవారు , కొండపల్లి, ఏటికొప్పాక కొయ్యబొమ్మల లాంటి సాంప్రదాయ హస్తకళలపై ఆధార పడే వారికి రూ. 10వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని అన్నారు. అర్హత ఉన్నవారందరికి సహాయం చేస్తున్నామని సకాలంలో వడ్డీ చెల్లించే వారికి తిరిగి వారి ఖాతాలలోకి వడ్డీ జమ చేస్తామని తెలిపారు. విశాఖపట్నం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పార్లమెంట్ సభ్యులు జి.మాధవి, శాసన సభ్యులు జి. అమర్ నాథ్, జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, జి.వి.ఎం .సి కమిషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, అసిస్టెంట్ కలెక్టర్ అదితి సింగ్, డి ఆర్ డి ఎ పిడి విశ్వేశ్వరరావు, యుసిడిపిడి వై. శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చిరువ్యాపారులు మరియు సాంప్రదాయ వృత్తిదారుల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి వ్యాపార, జీవనోపాధి కార్యక్రమాలకు ఈ డబ్బును వినియోగించుకొని ఆర్ధికంగా అభివృద్ది చెందాలని ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో మొదటి దశలో గత ఏడాది 54,277 మంది లబ్దిదారులకు రూ. 54.28 కోట్లు సహాయం చేసామని తెలిపారు. ప్రస్తుతం రెండవ దశలో 35,186 మంది లబ్దిదారులకు రూ. 35.19 కోట్లు సహాయం చేస్తున్నామని తెలిపారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 22,370 మంది లబ్దిదారు లున్నారని, జి.వి.ఎం సి పరిధిలో 9,320 మంది లబ్దిదారులున్నారని , నర్సీపట్నం మున్సిపాలిటి పరిధిలో 2,487 మంది లబ్దిదారులున్నారని , ఎలమంచిలి మున్సిపాలిటి పరిధిలో 1,009 మంది లబ్దిదారులున్నారని తెలిపారు.