చిరువ్యాపారులకు ఆర్థిక సహాయం జగనన్నతోడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగనన్నతోడు కింద జిల్లాలో 16 వేల 690 మందికి లబ్ది చేకూరుతుందని, వీరికి 16 కోట్ల 69 లక్షల రుపాయలు లబ్దిదారుల ఖాతాలలో ముఖ్యమంత్రి జమ చేసినట్లు చెప్పారు. చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల వద్ద వడ్డీలకు తీసుకొని వ్యాపారం చేసుకొనే వారని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి పాతయాత్రలో వారి కష్టాలను కనులార చూసి వారికి జగనన్నతోడు పథకం కింద ఒక్కొక్కరికి వడ్డీ లేకుండా 10 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముందు చూపుతో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 14 మెడికల్ కళాశాలలకు శంకు స్థాపన చేసారని, పేద వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందకు ఆరోగ్య శ్రీ పథకం వంటి వాటిని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కేరళ రాష్ట్ర వలే అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు. రైతులకు రైతు భరోసా, మహిళలకు దిశ చట్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్థికి అందరూ కలసికట్టు రావలసినదిగా ఆయన పిలుపు నిచ్చారు. ఆయనతో పాటు శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు, కళింగకోమటి కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.