యుద్ధప్రాతిపదికన లెవెలింగ్ పనులు..
Ens Balu
2
Kakinada
2021-06-08 12:14:24
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించిన లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల లెవెలింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని క్షేత్రస్థాయి అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్.. డివిజనల్, మండల స్థాయి అధికారులతో లేఅవుట్ల పనులపై వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఏవైనా లేఅవుట్లలో లెవెలింగ్ పనులు పూర్తికావాల్సి ఉంటే, వారం పది రోజుల్లో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లు పెండింగ్ పనులపై దృష్టి సారించి, పనులను పూర్తి చేయాలన్నారు. సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణతో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. లెవెలింగ్ చేయడానికి ఉపయోగించే మట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. లేఅవుట్లలో లెవెలింగ్ పనులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు.