మహావిశాఖ నగర ప్రజలకు సేంద్రీయ ఎరువుల తయారీపై అవగాహన పెంపొందించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలో ఆమె 6వ జోన్ 72వ వార్డు నడుపూర్ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సేంద్రీయ ఎరువుల తయారీలో మహిళలకు పొదుపు సంఘాల ద్వారా అవగాహన కల్పించాలని, ఇంటిలో వాడే కూరగాయల తొక్కలు లాంటివి ఉపయోగించి ఎరువులు తయారు చేసే విధానం తెలియపరచి, వాటి నుండి సేంద్రీయ ఎరువు తయారు చేసి పెరటలోని మొక్కలకు ఉపయోగించుకోవచ్చన్నారు. డోర్ టు డోర్ తడి-పొడి చెత్త సేకరణను చేసే విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కోలనీలో త్రాగునీరు సమయం ప్రకారం ఇస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతీ శుక్రవారం “డ్రై” డే పాటించాలని ఇళ్ళలో ఉండే మనీ ప్లాంట్స్, ఫ్రిజ్ వెనుక భాగంలో నిల్వ ఉన్న నీరు, పరిసరాలలో ఉండే కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ వస్తువులలోని నీరు, నీటి కుండీలలోని నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అప్పుడే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని సూచించారు. కోలనీ వాసులు పలు సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకు రాగా వాటిని పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న ప్రతీ భవనం యొక్క ప్లాన్ వార్డు సచివాలయ ప్లానింగు కార్యదర్శుల వద్ద ఉండాలని, అనధికార నిర్మాణాలు ఉండరాదని, ప్రతీ ప్లానింగు కార్యదర్శులు వార్డులో ప్రతీ రోజు తిరగాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ప్రసాద్ బాబు, సహాకయక ఇంజినీరు సుబ్బారావు, టౌన్ ప్లానింగు అధికారులు, శానిటరి సూపర్వైజర్లు, శానిటరి ఇన్స్పెక్టర్, వర్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.