నిరుపేదలు, రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వడ్డీ వ్యాపారస్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటూ అవస్థలు, అష్టకష్టాలు పడుతున్న వారికి మంచి చేసేందుకే జగనన్న తోడు పధకం రెండో దశకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ విధానంలో జగనన్న తోడు పథకం నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు పథకం రెండో విడత 3.7 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 10 వేలు వడ్డి లేని రుణం మొత్తం రూ.370 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి అక్కచెల్లెమ్ములు, అన్నదమ్ముల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో చిరువ్యాపారాలు చేసే వారు పెట్టుబడి కోసం గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తుల వద్ద వందకు పది రుపాయిలు వడ్డీ తీసుకొని ఇబ్బంది పడుతున్నారని గమనించి అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టామన్నారు. జగనన్న తోడు పథకం తొలి విడతలో 5.35 లక్షల మందికి రూ. 10 వేలు చోప్పున రుణాలు ఇచ్చామన్నారు. జగనన్న తోడు కింద మొత్తం 9.05 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే తొలి విడతలో 5.35 లక్షల మందికే బ్యాంకుల నుంచి రుణాలు వచ్చాయని, మిగిలిన 3.70 లక్షల మందికి బ్యాంకుల నుంచే కాకుండా ఆప్కాబ్, స్త్రీనిధి వంటి బ్యాంకులను రంగంలోకి దింపి ఈ రోజు రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకుల నుంచి లభించిన రుణాలను వడ్డీతో సహా సకాలంలో చిరువ్యాపారులు బ్యాంకులకు చెల్లిస్తే వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. దీని వలన రుణం తీసుకున్న వారికి తిరిగి సకాలంలో చెల్లించాలనే క్రమశిక్షణ వస్తుందన్నారు. రుణం మొత్తం చెల్లించిన లబ్దిదారులకు తిరిగి మళ్ళీ వడ్డీ లేని రుణం పొందే అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న వారు సచివాలయాలు ద్వారా దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి అర్హత పొందిన దరఖాస్తులకు ఆరునెలలకు ఒకసారి తిరిగి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా రాష్ట్రంలోని 9.05 లక్షల మంది చిరువ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
గుంటూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, నగరపాలక సంస్థ మేయరు కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్ధాళి గిరిధర్, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు, రాష్ట్ర మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా 28,463 మంది లబ్ధిదారులకు రూ.28.46 కోట్లు అందిస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులకు అందిస్తున్న రూ.10 వేలు వడ్డీ లేని రుణం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. జగనన్న తోడు చిరు వ్యాపారులకు జగమంత తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సందేశంతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడికొండ గ్రామానికి చెందిన లబ్దిదారు సరళాదేవి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో జగనన్న తోడు పథకం ద్వారా రూ. 10 వేలు వడ్డీ లేని రుణం అందించి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నారని తెలిపారు. తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే అన్నారు. వాలంటీర్ ఇంటికి వచ్చి చిరు వ్యాపారం చేస్తున్న నాకు జగనన్న పథకం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నట్లు చెబితే సంతోషపడ్డాను అన్నారు. గతంలో గత్యంతరం లేక వడ్డీలకు అప్పులు తీసుకొని వాటిని తీర్చలేక వడ్డీ వ్యాపారులకు భయపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్ధితుల్లో ఇంటిలో దాక్కున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మా పెద్ద కుమార్తెకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఆస్పత్రిలో ఉచితంగా కాన్పు చేయటంతో పాటు, ఇంటి వద్దకు వదిలి పెట్టి ఆపరేషన్ చేయించుకున్నందుకు రూ.3000 నగదు ఇచ్చారన్నారు. పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు పక్కా ఇళ్ళు కట్టి ఇస్తున్నారన్నారు. పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తూ కరోనా కష్ట సమయంలోను ఆదుకుంటున్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. మీరు చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలన్నారు.
జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా గ్రామీణ పరిధిలోని 22180 మంది లబ్ధిదారులకు రూ.22.18 కోట్లు, పట్టణ పరిధిలోని 6283 లబ్ధిదారులకు రూ.6.28 కోట్లు చెక్కులను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, నగరపాలక సంస్థ మేయరు కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్ధాళి గిరిధర్, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు, రాష్ట్ర మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా చిరువ్యాపారాలు, సాంప్రదాయ వృత్తులు చేసుకునే పేదలు 28,463 మందికి రూ.10 వేలు వడ్డీలేని రుణాలు ఇవ్వటం జరిగిందన్నారు, రాష్ట్రవ్యాప్తంగా జగనన్నతోడు పధకం రెండు దశలలో 9.05 లక్షలు మందికి వడ్డీలేని రుణాలు అందించామన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలోను పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు అన్ని సంక్షేమ పథకాలు చెప్పిన తేదీకి ఖచ్చితంగా అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమం, ఆర్ధిక అభివృద్ధే ధ్యేయంగా అన్ని పథకాలు ద్వారా ఆర్దిక సాయం అందిస్తున్నారన్నారు. చిరువ్యాపారులు ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.10,000 అప్పు చేస్తే వడ్డీ కింద రూ.3000 మినహాయించుకొని రూ.7000 మాత్రమే ఇస్తున్నారని ముఖ్యమంత్రి సుదీర్ఘ పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాలను తెలుసుకొని రూ.10వేలు వడ్డీలేని రుణం ఇచ్చేందుకు జగనన్న తోడు పథకంను మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. చిరు వ్యాపారులకు హామీ లేకుండా బ్యాంకులు రూ.10వేలు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నందుకు లబ్ధిదారుల తరుపున ముఖ్యమంత్రికి ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధరకు అన్ని రకాల పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి ) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (అసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, డిఆర్ఓ పి. కొండయ్య, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, లబ్ధిదారులు పాల్గొన్నారు.