ప్రజా సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం..
Ens Balu
2
Vizianagaram
2021-06-08 13:24:00
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని.. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేనివని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటమే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ఉద్దేశం అని పేర్కొన్నారు. మంగళవారం జగనన్న తోడు కార్యక్రమంలో పాల్గొనేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుందని, కుటుంబ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకొని కేంద్రం కూడా కొన్ని పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. వీధి వ్యాపారులు, తోపుడు బళ్ల వ్యాపారుల సంక్షేమార్థం జగనన్న తోడు పథకంలో భాగంగా అందజేసిన ఆర్థిక సాయం జిల్లాలో 46వేల మందికి అందిందని, ఈ సాయం ఎన్నో కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు. ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం సంక్షేమ పథకాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే లోపభూయిష్టమైన ఆస్తి పన్ను విధానాన్నిసవరించి నూతన పన్నుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని విలేకరులడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు. నిబంధనలను అనుసరించి ఎలాంటి అవినీతికి తావులేకుండా, సిఫార్సుల అవసరం లేకుండా పన్నుల విధానం అమలవుతోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని వ్యాఖ్యానించారు. ఆయన వెంట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాసు, కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేష్ బాబుచ, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి చినవెంటక అప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.