జిల్లా స‌మ‌గ్రాభివృద్దికి స‌త్వ‌ర చ‌ర్య‌లు..


Ens Balu
3
Vizianagaram
2021-06-08 13:47:30

విజ‌య‌న‌గ‌రంజిల్లా వెనుకబాటు త‌నాన్ని రూపుమాపి, స‌మ‌గ్రాభివృద్దికి స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ‌శాఖామాత్యులు వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉత్త‌రాంధ్ర ప్రాంతం తీవ్ర నిర్ల‌క్ష్యానికి గుర‌య్యింద‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాంతాభివృద్దిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ అధ్య‌క్ష‌త‌న జిల్లా స‌మీక్షా  స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లోని ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, గిరిజ‌న శాఖామాత్యులు పాముల పుష్ప‌శ్రీ‌వాణి, మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు హాజ‌ర‌య్యారు. జిల్లాలో కోవిడ్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, ఖ‌రీఫ్ స‌న్న‌ద్ద‌త‌, ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌, నీటి పారుద‌ల ప్రాజెక్టులు, గ్రామీణ ఉపాధిహామీ ప‌నుల ప్ర‌గ‌తి త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి, ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ రెండోద‌శ నియంత్ర‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌లు, మూడోద‌శ‌కు స‌న్న‌ద్ద‌త‌ను వివ‌రించారు. ప్ర‌స్తుతం జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని, రాష్ట్రంలోనే అతి త‌క్కువ‌గా 6శాతం పాజిటివిటీ రేటు న‌మోద‌య్యింద‌న్నారు. ఈ నెల 15 నాటికి పాజిటివిటీ రేటును 5శాతానికి త‌గ్గించ‌డానికి కృషి చేస్తున్నామ‌న్నారు. ఫీవ‌ర్ స‌ర్వే, టెస్టులు, వేక్సినేష‌న్‌, హోమ్ ఐసోలేష‌న్‌, కోవిడ్ కేర్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, వ్యాధికి చికిత్స త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. జిల్లాలో ఆక్సీజ‌న్‌కు ఎటువంటి కొర‌తా లేద‌ని అన్నారు. బ్లాక్ ఫంగ‌స్ కేసులు జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 13 న‌మోదు కాగా, ఒక‌రిని డిస్‌ఛార్జి చేశామ‌ని, ముగ్గురిని శ‌స్త్ర‌చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు. మిగిలిన‌వారికి స్థానికంగానే చికిత్స చేస్తున్నామ‌ని, బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్ చికిత్స కోసం జిల్లా కేంద్రాసుప‌త్రిలో 20 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేక వార్డును ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్‌ మూడోద‌శ‌ను ఎదుర్కొన‌డానికి చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వివ‌రించారు. మ‌రో 8,300 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం మిగిలిఉంద‌ని, ఈ నెల 15 లోగా సేక‌ర‌ణ పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

              ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి మాట్లాడుతూ, ఈ-క్రాప్ న‌మోదు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేద‌ని, దీనివల్ల రైతులు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. న‌మోదులో సిబ్బంది బాధ్య‌ర‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. అలాగే దీర్ఘ‌వ్యాదిగ్ర‌స్తుల‌కు ఇచ్చే పింఛ‌న్ల మంజూరులో అవ‌క‌త‌వ‌క‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. చాలామంది అర్హుల‌కు ఈ పింఛ‌న్లు అంద‌టం లేద‌ని, ఇదే స‌మ‌యంలో కొంద‌రు అన‌ర్హులు పింఛ‌న్లు పొందుతున్నార‌ని చెప్పారు. వీటిపై స‌మ‌గ్ర విచార‌ణ చేసి, అర్హుల‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

             మున్సిప‌ల్ శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, వివిధ అంశాల‌పై కూలంకుషంగా స‌మీక్షించారు. కోవిడ్ మూడోద‌శ‌ను ఎదుర్కొన‌డానికి, పిల్ల‌ల వ‌య‌సుల వారీగా వివ‌రాలు సేక‌రించి, వ‌ర్గీక‌ర‌ణ చేసి, దానికి అనుగుణంగా ప్రణాళిక‌ను సిద్దం చేయాల‌ని సూచించారు.  రైతుకు అవ‌స‌ర‌మైన విత్త‌నాలు, ఎరువుల కొర‌త రాకుండా చూడాల‌ని వ్య‌వ‌సాయాధికారుల‌ను ఆదేశించారు. త‌మ‌ది రైతు ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని, ఎట్టిప‌రిస్థితిలోనూ రైతుకు న‌ష్టం వాటిల్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై స‌మీక్షిస్తూ, మిల్లుల సామ‌ర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, స‌మ‌గ్ర విధానాన్ని రూపొందించాల‌ని సూచించారు. గ్రామీణ ఉపాధిహామీ క‌న్వ‌ర్జెన్సీ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, రెండుమూడు రోజుల్లో పెండింగ్ బిల్లుల‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు. ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మంపై ప‌ర్య‌వేక్ష‌ణ పెంచేందుకు, ఇళ్ల నిర్మాణాన్ని స‌కాలంలో పూర్తి చేసేందుకు, ప‌ట్ట‌ణాల్లో ప‌బ్లిక్‌హెల్త్ ఇంజ‌నీర్లు, వార్డు ఎమినిటిస్ కార్య‌ద‌ర్శుల సేవ‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌ని సూచించారు. ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

              ఎంఎల్‌సి పివిఎన్ మాధ‌వ్ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్ర‌ణ‌కు జిల్లా అధికారులు తీసుకున్న చ‌ర్య‌ల‌ను అభినందించారు.  ఏప్రెల్ 26న జిల్లా కేంద్రాసుప‌త్రిలో జ‌రిగిన సంఘ‌ట‌ను ప్ర‌స్తావిస్తూ, మృతులు ఎవ‌రైనా ఉంటే, వారికి ప్ర‌భుత్వం నుంచి పరిహారం ఇప్పించేందుకు కృషి చేయాల‌ని కోరారు. ఆ నాటి సంఘ‌ట‌న‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ ఎవ‌రూ చ‌నిపోలేద‌ని, సాధార‌ణ మ‌ర‌ణాలేన‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సి పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ కార‌ణంగా సుమారు 48 మంది ఉపాధ్యాయులు మ‌ర‌ణించార‌ని, కారుణ్య నియామ‌కాల్లో వారికి త‌గిన ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని కోరారు. బొబ్బిలి శాస‌న‌స‌భ్యులు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు మాట్లాడుతూ, గ‌త ఖ‌రీఫ్‌లో 1121 ర‌కం వ‌రి విత్త‌నాలు ఇచ్చార‌ని, దీనివ‌ల్ల జిల్లా రైతుల‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని అన్నారు. జిల్లా వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని, రైతుకు లాభ‌దాయ‌కంగా ఉండే ర‌కాల‌ను ఇవ్వాల‌ని కోరారు. పార్వ‌తీపురం ఎంఎల్ఏ అల‌జంగి జోగారావు మాట్లాడుతూ, స‌బ్‌ప్లాన్ మండ‌లాల్లోని గిరిజ‌న రైతుల‌కు 90శాతం స‌బ్సిడీపై విత్త‌నాలు ఇస్తున్నార‌ని, ఈ అవ‌కాశాన్ని జిల్లాలోని గిరిజ‌న రైతులంద‌రికీ వ‌ర్తింప‌జేయాల‌ని కోరారు. పార్వ‌తీపురంలో గ‌త రెండు నెల‌లుగా విద్యుత్ స‌మ‌స్య ఉంద‌ని, సీతాన‌గ‌రం వంతెన నిర్మాణ ప‌నులు ఆగిపోయాయ‌ని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఎస్‌.కోట ఎంఎల్ఏ క‌డుబండి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనే మెరుగైన వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని అన్నారు. ఎస్‌కోట‌లో ఎల‌క్ట్రిక‌ల్ ఏఇ పోస్టు ఏడాది కాలంగా ఖాలీగా ఉంద‌న్నారు.

                చివ‌రిగా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, అజెండాలోని అన్ని అంశాల‌నూ కూలంక‌షంగా చ‌ర్చించి, త‌గిన నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. జిల్లాలో కోవిడ్ సెకండ్‌వేవ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని, మూడో ద‌శ‌వ‌స్తే, దానిని ఎదుర్కొనేందుకు కూడా జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉంద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి హాయంలో స‌కాలంలో రుతుప‌వ‌నాలు కూడా వ‌స్తున్నాయ‌ని, రైతుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ దృష్టికి తెచ్చిన స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రిస్తూ, రాజ‌కీయాల‌కు అతీతంగా జిల్లాను అభివృద్ది ప‌థాన న‌డ‌ప‌డానికి కృషి చేస్తున్నామ‌ని వెలంప‌ల్లి స్ప‌ష్టం చేశారు.

                ఈ స‌మావేశంలో పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, గొడ్డేటి మాధ‌వి, ఎంవివి స‌త్య‌నారాయ‌ణ‌, ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్‌బాబు, ఎంఎల్ఏలు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి జిల్లా ఛైర్మ‌న్ వాకాడ నాగేశ్వ‌ర్రావు, జిల్లా ఎస్‌పి బి.రాజ‌కుమారి, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, సిపిఓ జె.విజ‌య‌ల‌క్ష్మి, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు రైతుల‌కు ఎరువులు, విత్త‌నాల‌ను మంత్రుల చేతుల‌మీదుగా అంద‌జేశారు.