చివరి వ్యక్తి వరకూ ఫలాలు అందాలి..


Ens Balu
2
Srikakulam
2021-06-08 13:48:33

 ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాఠకర్ అన్నారు. ఆ మేరకు ప్రతి ఒక్కరూ ఉత్తమ సేవలు అందించాలని కోరారు. మంగళవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శాఖల ప్రగతిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బృందంగా (టీమ్ వర్క్) పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుందామని ఆయన పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి ప్రజల గుండెల్లో నిలుద్దామని ఉద్బోధించారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రత కనిపించాలన్నారు. పంచాయతీల పనితీరుకు పరిశుభ్రత సూచికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇసుక రీచ్ ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, దానిపై వివిధ శాఖల నిర్మాణాలు ఆధార్ ఉంటాయని ఆయన చెప్పారు. మత్స్యకారుల భరోసా క్రింద ఖాతాల్లో జమకాని అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లాక్ డౌన్ కారణంగా విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధికారులు తమ శాఖల కార్యకలాపాలను వివరించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, ఐటిడిఏ పిఓ సిహెచ్.శ్రీధర్, డిఎఫ్ఓ సందీప్ కృపాకర్, డిఆర్ఓ బి.దయానిధి, ఆర్డీఓలు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ బి.లక్ష్మీపతి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణవేణి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణమూర్తి, నగర పాలక సంస్థ కమీషనర్ కె.శివ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.