జనవరి నాటికి రామతీర్ధ ఆలయం..


Ens Balu
3
Vizianagaram
2021-06-09 09:54:01

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై గత ఏడాది డిసెంబర్ లో కొందరు దుండగుల దాడిలో దెబ్బతిన్న రామస్వామి వారి ఆలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది(2022) జనవరి నాటికి పూర్తి చేసి సీతారామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టిస్తామని రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు వెల్లడించారు. ఆలయాన్ని ప్రారంభించేందుకు జనవరిలో ముహూర్తాన్ని చూస్తున్నట్టు పేర్కొన్నారు. దేవాలయాన్ని రాతి కట్టడంగా రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చిలకలూరిపేట వద్ద రాతి నిర్మాణాలకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు.  జనవరి నాటికి ఆలయ నిర్మాణాన్నిత్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. కొండపై ఆలయాన్ని నిర్మించడంలో చాలా ఇబ్బందులు వున్నాయని, నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తరలించడం, విద్యుత్ సరఫరా, నీటి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు వున్నా వాటిని పరిష్కరించేందుకు దేవాదాయ శాఖ ప్రాంతీయ కమీషనర్ భ్రమరాంభ ను ప్రత్యేకాధికారిగా నియమిస్తున్నట్టు చెప్పారు. అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో వున్నట్లు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.3 కోట్లు మంజూరు చేసిందని, నిర్మాణ సంస్థను కుడా ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా పూర్తి శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం, విగ్రహాల పునఃప్రతిష్ఠ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో కొండపై ఆలయంలో ఘటన జరిగిన వెంటనే నెల రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో సీతారాముల విగ్రహాలను తయారు చేయించి ఇక్కడకు రప్పించామన్నారు. వెనువెంటనే రాతి కట్టడంగా ఆలయాన్ని నిర్మించేందుకు మూడు కోట్ల రూపాయలతో దేవాదాయ శాఖ ప్రతిపాదనలు రుపొందించగా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినపుడే ఒక ఏడాదిలో ఆలయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.

రామతీర్థంలోని రామస్వామి వారి ఆలయాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. విజయనగరం ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల శాసన సభ్యులు బడుకొండ అప్పల నాయుడుతో కలసి మంత్రి ఆలయంలో పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొండపై నిర్మించనున్న ఆలయ నమూనా చిత్రపటాలను విడుదల చేశారు.

మీడియాతో మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, దీనిలో భాగంగా ఆలయాల్లో సి.సి. కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలను రాజకీయం చేయడం తగదని మంత్రి చెప్పారు.

ఈ పర్యటనలో మంత్రి వెంట దేవాదాయ శాఖ కమీషనర్ అర్జున రావు, దేవాదాయ శాఖ జాయింట్ కమీషనర్ భ్రమరాంభ, ప్రాంతీయ కమీషనర్ సురేష్ బాబు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, సహాయ కమీషనర్లు డి.వి.ప్రసాదరావు, వినోద్ కుమార్, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఇ.ఓ. కిశోర్ కుమార్, ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి, దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం డి.ఇ. సైదా, ఏ.ఇ. కృష్ణ, నెల్లిమర్ల తహశీల్దార్ రాము తదితరులు పాల్గొన్నారు.