విజయనగరం జిల్లాలో సకాలంలో గృహనిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) కె.మయూర్ అశోక్ అన్నారు. ఆయన జాయింట్ కలెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన, ఇంతకుముందు తెనాలి సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి, జిల్లాకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చెన్నారెడ్డి భవన్‌లోని తన ఛాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అర్హులందరికీ ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తోందని చెప్పారు. ఏడాదికి సుమారు 15లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇది దేశంలోనే అతిపెద్ద కార్యక్రమమని, ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించిందని చెప్పారు. గృహనిర్మాణం తోపాటు మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తామని తెలిపారు. జిల్లాలోని అధికారులను సమన్వయం చేసుకొని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాన్ని నడిపిస్తానని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సామాన్య ప్రజలు సైతం నేరుగా తనను కలిసి, తమ సమస్యలను చెప్పుకోవచ్చని సూచించారు. జిల్లా గృహనిర్మాణశాఖ పిడి ఎస్‌వి రమణమూర్తి, ఇతర అధికారులు జెసిని కలిసి అభినందనలు తెలిపారు.