కోవిడ్-19 విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అమలవుతున్న కర్ఫ్యూ జూన్ 20 వరకు కొనసాగుతుందని, శుక్రవారం నుంచి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గం. వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లకు, ఫార్మసీలతో పాటు అత్యవసర సర్వీసుల పంపిణీతో ముడిపడిన వాటికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని 51-60 సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్ 188, ఇతర వర్తింపు చట్టాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు నిబంధనల కచ్చిత అమలుకు ఎస్‌పీలు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.