మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కొండవాలు ప్రాంతాల్లో చెత్తవేయకుండా చర్యలు తీసుకోవాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. గురువారం ఈ మోరకు ఎనిమిదవ జోన్ 94వ వార్డు వేపగుంట పరిధిలోని గౌతమ్ నగర్, బి.సి.కోలనీ తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ స్థానిక కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావుతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కోలనీ వాసులతో మాట్లాడుతూ, కొండవాలు ప్రాంతం పైన నివసిస్తున్న వారు కాలువలో చెత్త వేయరాదని, దాని వలన కొండ దిగువ భాగంలో చెత్త పేరుకుపోయి కాలువలు పొంగిపోతాయని తెలిపారు. ప్రతీ రోజు తడి-పొడి చెత్తను విభజించి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వలేకుండా చూడాలని, ప్రతీ రోజు త్రాగు నీరు సమయానికి వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అధికారులతో మాట్లాడుతూ, రానున్నది వర్షాకాలమని, కాలువలలో నీరు సాఫీగా ప్రవహించే విధంగా చూడాలని, ప్రధాన కాలువలోను చెత్తను, రోడ్లపైన ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలలో తుప్పలు, చెత్త పేరుకు పోకుండా ఆ స్థల యజమానిచే శుభ్రం చేయించాలని, లేకుంటే వారికి జరిమానా విధించాలని, పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మీకులను సర్దుబాటు చేయాలని, భూ గర్భ డ్రైనేజీ నుండి మురికి నీరు బయటకు పొంగకుండా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ ఇంటికి వెళ్లి సీజనల్ వ్యాధులపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధు కుమార్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, ఎఎంఓహెచ్ లక్ష్మి తులసి, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.