అనంత ఆత్మీయత ఎన్నటికీ మరువలేనిది..


Ens Balu
5
Anantapur
2021-06-10 13:43:52

 ప్రభుత్వ ఉద్యోగికి వృత్తిరీత్యా బదిలీ కావడం సహజమని అయితే తన జీవితంలో అనంతపురం జిల్లా ప్రజలు , అధికారులు , ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు తదితర వర్గాలు చూపిన ఆత్మీయత ఎన్నటికీ మరువలేనని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ అయిన నేపథ్యంలో వ్యక్తిగతంగా ఆయనను కలవడానికి అనేకమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు , సేవా సంస్థల ప్రతినిధులు,  జర్నలిస్టులు, కవులు, రచయితలు, విద్యార్థులు, కియా మోటార్స్ ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొని  ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ప్రజల ఆత్మీయత మరువలేనిదని ఇంతటి ప్రజల అభిమానం చూరగొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ అభిమానం మరింత బాధ్యతను కూడా  పెంచిందని తెలిపారు. తాను జిల్లా నుండి బదిలీ పై వెళ్లే క్రమంలో జిల్లా యంత్రాంగం ఇచ్చిన సహకారం ఎనలేనిదని తెలియజేస్తూ ఒక సందర్భంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనపై ఉన్న అభిమానంతో ఎంతోమంది స్వచ్ఛందంగా వీడ్కోలు పలుకడానికి తరలి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ గా అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు భాగస్వామ్యంతో అమలు చేయడం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నానన్నారు.

 కరువు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యంలో భాగంగా   సామాజిక ,ఆర్థిక అజెండాలను  ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి యొక్క జీవన విధానాలను వారి అభ్యున్నతి వైపు పయనింప చేసేందుకు కృషి చేశానన్నారు. తాను పనిచేసిన కాలంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉరవ కొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ,  కియాప్రతినిధులు , పలువురు ఉద్యోగులు , ఎమ్మార్పీఎస్, ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ సంఘాలకు చెందిన నాయకులు , విద్యార్థి సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు . ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలతో కూడిన వినతులను కలెక్టర్ కు అందజేశారు.