సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపండి..


Ens Balu
2
Anantapur
2021-06-10 13:50:56

 ఉన్నతాధికారులు తమ అధికారాన్ని సామాన్యుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, వెలుగులు నింపేందుకు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపీఆర్సీ భవన్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అధికారుల సహకారంతోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టగలిగానన్నారు. కోవిడ్ పై పోరాటంలో కుటుంబ సభ్యుల్లాంటి అధికారులను కోల్పోవడం బాధాకరమన్నారు. జిల్లాలో తాను చేపట్టిన పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సామాజిక ఎజెండానే స్ఫూర్తి అన్నారు. "అనంతపురము జిల్లా వాసుల మాట కటువు, మనసు వెన్న- ఈ ప్రాంతంలో దొరికేటంత రుచికరమైన పండ్లు మరో చోట  దొరకవు" అన్నారు. జిల్లాను కుటుంబం లాగానే భావించానన్నారు. అనంత జిల్లాను వెనుకబడిన జిల్లాగా పరిగణించ కూడదనుకున్నానని, అభివృద్ధి చెందిన జిల్లాగా ఉండాలనే తపనతో అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై పనులు వేగవంతం చేయడం జరిగిందన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఏ విధంగా పరిష్కారం దొరుకుతుందని ఆలోచించడం తన నైజమన్నారు. అందుకే కోవిడ్ సమయంలో వైద్య రంగంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయగలిగేందుకు కృషి చేశానన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు మంచి సేవలు అందించారని కొనియాడారు. జిల్లాలో పనిచేయడం గొప్ప సంతృప్తి ఇచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ,  మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.