రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల న్నింటినిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూర్చాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. ఏ పథకంలోనైనా లబ్దిదారుల ఎంపికలో ముఖ్యమంత్రి పార్టీలు చూడరని, రాజకీయం చేయరని కితాబిచ్చారు. రైతు పక్షపాతిగా తాను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రైతులకు మేలు కలిగించే విధంగా తీసుకుంటున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న విధానంతో సీఎం పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కురుపాం నియోజకవర్గస్థాయి సబ్సిడీ వరివిత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను తీసుకొనే ప్రతి నిర్ణయం కూడా రైతులకు మేలు కలిగేవిధంగా తీసుకుంటున్నారని, అనుక్షణం రైతుల మేలు గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రైతుభరోసా ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చినా, రైతులకు మరింత త్వరగా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే రైతు భరోసాను ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ప్రశంసించారు. రైతుభరోసా సాయాన్ని అందించడంలోనూ, పంటల భీమా పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయడంలోనూ ముఖ్యమంత్రి ఎక్కడా పార్టీలను చూడలేదని, రాజకీయం చేయలేదని స్పష్టం చేసారు. ఈ పథకాలు మాత్రమే కాకుండా ఏ సంక్షేమ పథకమైనా అర్హతకలిగిన ప్రతి ఒక్కరికీ చేరాలని, తమ పార్టీకి ఓటు వేయని వారికైనా అర్హత ఉంటే అన్ని పథకాల్లోనూ లబ్ది చేకూర్చాలన్నది సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని అభిప్రాయపడ్డారు. రైతు భరోసా,పంటల భీమా మాత్రమే కాకుండా ఆర్బీకేల్లో విత్తనాలు పంపిణీ చేసే వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. గతంలో రైతులు విత్తనాల కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారని, మండలాల కార్యాలయాల చుట్టూ తిరిగేవారని గుర్తు చేసారు. ఇప్పుడు మండలాఫీసులకు వెళ్లనవసరం లేకుండా ప్రతి సచివాలయ పరిధిలో రైతుభరోసా కేంద్రాలను తీసుకొచ్చి గ్రామస్థాయిలోనే విత్తనాలను అందిస్తున్నారని, గ్రామ స్థాయిలోనే ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను నియమించారని పుష్ప శ్రీవాణి తెలిపారు.విత్తనాలతో పాటుగా నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులను కూడా అందిస్తున్నారని చెప్పారు. ఇదికాకుండా రైతులకు ఉచిత విద్యుత్తు, వైయస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్ల కేటాయింపు, మార్కెట్లో వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరలు, గిరిజన రైతులకు 90 శాతం సబ్బిడీతో విత్తనాలను కూడా అందిస్తున్నారని వివరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధానంతో జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అమలు చేసే ఏ పథకంలోనైనా అర్హత ఉంటేచాలు ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుతుందన్నారు. ఏ పథకంలోనైనా అర్హత ఉండి కూడా లబ్ది కలగకపోతే సంబంధిత అధికారులకు, లేదా తమకు ఫిర్యాదు చేయాలని పుష్ప శ్రీవాణి సూచించారు. వైసీపీ మండల కన్వీనర్ మూడడ్ల గౌరీశంకర్ రావు, సర్పంచ్ కోట రమేష్ తోపాటుగా వ్యవసాయశాఖకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.