చిత్తూరు జిల్లాలోని అత్యధికంగా రైతులు వున్నారని వ్యవసాయం జీవనాధారంగా సాగిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ సలహా మండలి మంచి సలహాలతో రైతులకు అధికదిగుబడి పలసాయం, కాలానుగుణంగా అవసరమయ్యే సలహాలను అందించి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు మైనింగ్ శాఖల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా ఎంపికైన పాలేరు రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనతో మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగానికి కావాల్సిన సూచనలు ఎప్పటికప్పుడు చేస్తూ అధికారులను సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ అభివృద్ధికి అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రధానంగా టమోటా మామిడి విషయంలో ప్రత్యేక చర్యలు చాలా అవసరమని ఎక్కువగా వాణిజ్య పంటల మీద ఆధారపడితే రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని అందుకోసం శ్రమించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36 మంది కమిటీ సభ్యులను నియమించడం జరిగిందని విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న చిత్తూరు జిల్లాలో ఏ ప్రాంతానికి ఏ పంటలు అనువుగా ఉంటాయో సభ్యుల నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు ఇతర మార్గాల ద్వారా విలువైన సూచనలు అందించాలని చైర్మన్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో లో బంగారు పాలెం మండలానికి చెందిన రైతు ప్రతినిధులు శిరీష్ రెడ్డి,శరత్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి లు పాల్గొన్నారు.