జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోండి..


Ens Balu
2
Visakhapatnam
2021-06-11 09:27:22

 కోవిడ్ బారినపడి విశాఖ జిల్లాలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్  వినయ్ చంద్ ను కలిసి ఇందుకు సంబంధించిన
వినతి పత్రం సమర్పించారు. కరోనా రెండవ దశలో నగరంలో  పది మంది, రూరల్ ప్రాంతంలో ఆరుగురు కలిపి మొత్తం 16 మంది జర్నలిస్టులు మృతి చెందారన్నారు. ఇందుకు సంబంధించి వారి వివరాలు సంబంధిత  వినతిపత్రంలో పొందుపరిచామని కలెక్టర్ కు వివరించారు. ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు రావాల్సిన నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ను శ్రీను బాబు కోరారు. అయితే  ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో చాలా మంది కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయని కాబట్టి వారికి ఏడాది కి సరిపోయే నిత్యవసర వస్తువులు అందజేసే విధంగా చూడాలని అందుకు తగిన విధంగా అధికారులకు  ఆదేశాలు ఇవ్వాలని శ్రీనుబాబు కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు శ్రీను బాబు వినతి పై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా జర్నలిస్టుల  కుటుంబాలు కు సాయం చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీనుబాబు కలెక్టర్ ను ఘనంగా సత్కరించి, సింహాద్రి నాథుడి జ్ఞాపికను, చందన ప్రసాదం, శేష వస్త్రం బహుకరించారు.