అనంతపురం జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ కు జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డి ఆర్ ఓ గాయత్రీ దేవి, కలెక్టరేట్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ చాంబర్ లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆమె వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. తదనంతరం బదిలీ అయిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నుంచి అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ గా నాగలక్ష్మి సెల్వరాజన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత జిల్లా కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించాలనేది నా ఆకాంక్ష అన్నారు. జిల్లాలో విజయవంతంగా పనిచేసేందుకు అందరి సహకారం అవసరమన్నారు. జిల్లాలో అభివృద్ధి బాటలో నడిపించేందుకు జిల్లా మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా మిత్రులు ప్రజలు అందరూ సహకారం అందించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ కొంచెం తగ్గినప్పటికీ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెకానిజంను అనుసరిస్తూ ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రాధాన్యత ప్రకారం ముందుకు తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతకుముందు నూతన జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి సెల్వరాజన్ పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నిషా0తి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్, డి ఆర్ ఓ, తదితరులు అభినందనలు తెలియజేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు, సిబ్బంది తదితరులు జిల్లా కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.