ఈ-క్రాప్ లో పంటలను నమోదు చేసుకోవాలి..


Ens Balu
4
Visakhapatnam
2021-06-11 12:16:03

విశాఖజిల్లాలో ఖరీఫ్ 2021 లో జిల్లాలోని  రైతులందరూ తప్పని సరిగా     ఇ -  క్రాప్ లో పంటలను నమోదు చేసుకొనే విధంగా   గ్రామ స్థాయిలో   అవగాహన కల్పించాలని  జాయింట్  కలెక్టర్  ఎం .వేణు గోపాల రెడ్డి  అధికారులను  ఆదేశించారు.  శుక్రవారం నాడు  స్థానిక  కలెక్టరేట్ లో  వై ఎస్ ఆర్  ఉచిత  పంటల  బీమా పథకం  అమలుపై   జిల్లా స్థాయి  వర్క్ షాపును  నిర్వహించారు.  ఈ వర్క్ షాపు లో  వ్యవసాయ, అనుబంధరంగాల  అధికారులు, జిల్లా  వ్యవసాయ సలహామండలి సభ్యులు పాల్గొన్నారు. వర్క్ షాపు అనంతరం   జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో  ఇప్పటి వరకు  వరి, సజ్జలు, వేరుశెనగ, మినుములు, రాగులు,  కంది, మొక్క జొన్న, చెరకు (మొక్క),  చెరకు (కార్సి) మొదలైన   9 పంటలు మాత్రమే  ఉచిత పంటల బీమా పథకం పరిధిలో ఉన్నాయని  తెలిపారు.  ఇపుడు అదనంగా  రాజ్ మా , పసుపు,  ప్రత్తి,  అరటి పంటలను కూడా  బీమా పథకం పరిధిలోకి తీసుకు రావాలని  సిఫారసు  చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.   పంటల బీమాలో  చెరకు పంటకు  మండలం యూనిట్ గా  ఉందని,  ఇక ముందు  గ్రామం  యూనిట్ గా  పరిగణించాలని  ప్రతి పాదించినట్టు తెలిపారు.   ప్రతి రైతు  భరోసా కేంద్రంలోను వర్షపాతం నమోదు చేయడానికి  రెయిన్  గేజ్  స్టేషను  ఏర్పాటు చేస్తే  రైతులకు  మేలు చేకూరుతుందని  వర్క్ షాపు లో  ప్రతి పాదించినట్టు  ఆయన తెలిపారు. 
ఈ సమావేశంలో   వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు బి. మోహన్ రావు,   జిల్లా  వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు  చిక్కాల రామారావు, సి పి ఓ  ఎం .శ్రీనివాసరావు,  ఇరిగేషన్ ఎస్. ఇ ., సూర్యకుమార్,  ఎల్ . డి .ఎం . సాయినాధ్, వ్యవసాయ శాస్త్రవేత్తలు ,  వ్యవసాయ , ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.