నవరత్నాలు – పేదలం దరికీ ఇళ్లు కార్యక్రమం తొలిదశ క్రింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం మద్యాహ్నం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి హౌసింగ్, రెవెన్యూ, పంచాయితీరాజ్, ఆర్ డబ్యూ ఎస్, ట్రాన్స్కో, డిఆర్డిఏ, మున్సిపల్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గృహనిర్మాణ కార్యక్రమాల కార్యచరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 10 వ తేదీ వరకూ జగనన్న కాలనీలలో నిర్వహించిన శంకుస్థాపనల ద్వారా 10 వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గృహనిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసేలా పర్యవేక్షించేందకు ప్రతి నియోజక వర్గానికి ఒక సీనియర్ అధికారిని సూపర్ వైజరీ అధికారిగా నియమించామని, ప్రతి శుక్రవారం ఈ అంశపై జిల్లా స్థాయి నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే డివిజనల్ అధికారులు, సూపర్ వైజరీ అధికారులు ప్రతి శనివారం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన బోర్లు, విద్యుత్, అప్రోచ్ రోడ్ వంటి సదుపాయాలను జగనన్న కాలనీలలో ఆయా శాఖల సమన్వయంతో అభివృద్ది చేయాలన్నారు. లబ్దిదారులతో ఆన్ సైట్ సమావేశాలు నిర్వహించి తొలిదశ క్రింద మంజూరైన వారందరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా మోటివేట్ చేయాలని, పనులు ప్రారంభించేందుకు కనీసం 50 వేల రూపాయలు రుణం స్వయం సహాయ బృందాల ద్వారా కల్పించాలని తెలిపారు. లబ్దిదారులకు జాబ్ కార్డుల జారీ సత్వరం పూర్తి చేయాలని, ఇసుక ఉచితంగా సరఫరా చేయడంతోపాటు, పర్చేజ్ కమిటీల ద్వారా బిల్డింగ్ మెటీరియల్ సాధ్యమైనంత తక్కువ ధరలో అందేలా చూడాలని సూచించారు. వెయ్యి ఆపై ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న పెద్ద కాలనీలలో వర్కుషెడ్లు, మెటిరియల్ డిపోలను తాత్కాలిక స్ట్రక్చర్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమలాపురం, రామచంద్రపురం డివిజనల్లలో ఇంకా పూర్తి కావలసిన లే అవుట్ లెవెలింగ్ పనులను వెంటనే నిర్వహించాలని, పెద్దాపురం, సామర్లకోట లేఅవట్ లలో ఇళ్ల నిర్మాణానికి అవరోధంగా ఉన్న పవర్ లైన్ల ప్రక్కకు తరలించాలని ఆదేశించారు. లే అవుట్లలో వర్షపు నీరు నిలిచి పనులకు అటంకం కాకుండా పైప్ లైన్ డ్రైన్ లను ఏర్పాటు చేయాలన్నారు. లే అవుట్లలో ఏర్పాటు చేసిన బోర్లకు విద్యుత్ సరఫరా కల్పించాలని ట్రాన్స్ కో ఎస్ఈ ని కోరారు. ఉపాధి హామీ పధకం క్రింద లే అవుటల్లో అంతర్గత సిసి రోడ్లు, డ్రెయిన్ల పనులకు అంచనాలు, ప్రతిపాదనలు సిద్దం చేయాలని పంచాయితీ రాజ్ శాఖను కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి.రాజకుమారి, హౌసింగ్ పిడి జి.వీరేశ్వరప్రసాద్, ఆర్ డబ్ల్యూ ఎస్, ట్రాన్స్ కో, పిఆర్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.