ఆక్రమణలు జరగకుండా చూడాలి..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-11 14:46:11

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఫుట్ పాత్ లు, ఆక్రమణలు జరగకుండా చూడాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని నాలుగవ జోన్ 36వ వార్డు పరిధిలోని పూర్ణా మార్కెట్, రంగిరాజ వీధి తదితర ప్రాంతాలలో  కమిషనర్  పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్లను శుభ్రపరుస్తూ చెత్తను వెను వెంటనే డంపింగు యార్డుకు తరలించాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి తడి-పొడి , ప్రమాదకర చెత్తను వేరు వేరుగా స్వీకరించాలన్నారు. తడి-పొడి చెత్త ఇచ్చేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గెడ్డలలోని చెత్తను తొలగించి నీరు సాఫీగా ప్రవహించే విధంగా చేయాలని శానిటరి అధికారులను ఆదేశించారు. పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య సిబ్బందిని నియమించాలని, ఎవ్వరికి కేటాయించిన పనిని వారిచే చేయించాలని, అన్ని పనులు ఒకే పారిశుధ్య కార్మికుడిని ఉపయోగించరాదన్నారు. లిట్టర్ బిన్స్ శుభ్రంగా ఉంచాలని, చెత్తను బిన్స్ చుట్టు ప్రక్కల పడవేయకుండా చూడాలని, బిన్స్ చుట్టూ బ్లీచింగు జల్లించాలని, బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వార్డులో నిర్మాణంలో ఉన్న భవనముల యొక్క ప్లాన్ వివరాలను తెలపాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఇంటింటి సర్వే జరపాలని, కుండీలలో నీరు నిల్వ లేకుండా ప్రతి శుక్రవారం “డ్రై” డే పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని వెటర్నరి డాక్టరు కిషోర్ ను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీధి దీపాలు నిర్వహణ, త్రాగు నీరు సమయానికి అందించడం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ ఫణిరాం, వెటర్నరి డాక్టరు కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, గణేష్ బాబు, శానిటరి సూపర్వైజర్ శ్రీనివాస రాజ్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.