కేసులు తగ్గాయని అజాగ్రత వద్దు..
Ens Balu
2
Anantapur
2021-06-11 15:05:21
అనంతపురం జిల్లాలో కేసులు తగ్గుతున్నాయని కోవిడ్ ను తేలిగ్గా తీసుకోవద్దని నోడల్ అధికారులను హెచ్చరించారు. జిల్లా నూతన కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మొట్టమొదటి సమీక్షను కోవిడ్ పై నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధికారులకు థర్డ్ వేవ్ కోవిడ్ పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ ను ఎదుర్కోడానికి కావాల్సిన మౌళిక వసతుల గురించి అధికారులు కలెక్టరుకు వివరించారు. కోవిడ్ ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, తాత్కాలిక ఆసుపత్రుల వివరాల గురించి ఆరా తీశారు. మెడికల్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలు, సరఫరాపై జేసీ నిశాంత్ కుమార్ వివరించారు. ప్రస్తుతం జిల్లాలోని కోవిడ్ కేసులు, మరణాలపై జేసీ సిరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైద్య రంగంలో అక్రమాలపై తీసుకున్న చర్యల గురించి ప్రత్యేక దృష్టి సారించారు. కోవిడ్ ఔషధాల బ్లాక్ మార్కెటింగ్, ఆరోగ్య శ్రీ సమస్యలపై తీసుకున్న వివరాలు తెలుసుకున్నారు. కోవిడ్ మూడో వేవ్ రూపంలో మరో సారి విజృంభించినా సిద్ధంగా ఉండాలని నోడల్ అధికారులు, వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ మరణాలపై ఆడిట్ నిర్వహించుకుని భవిష్యత్తులో మరణాల సంఖ్య తగ్గించేందుకు ప్రణాళిక రచించాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ట్రైనీ కలెక్టర్ సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు.