ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంయుక్త కలెక్టర్ ( రైతు బరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్.దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అబివద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ( ఆసరా,సంక్షేమం) శ్రీధర్ రెడ్డి లతో కలసి నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా, వైఎస్సార్ క్లీనిక్ భవనాల నిర్మాణం, ప్రాధమిక ఆరోగ్య వైద్య కేంద్రాలలో నాడు – నేడు, అర్బన్ హెల్త్ క్లీనిక్స్, ఇళ్ల పట్టాల పంపిణీ, వాహన మిత్ర, వాలంటీర్ల నియామకం వంటి అంశాలపై జిల్లాలోని పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన పది వేల ఇళ్ళ శంఖుస్థాపన కార్యక్రమంపై ఆరా తీశారు. దీనిపై స్పందించిన గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణు గోపాల రావు 86 శాతం పూరైనట్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. మరికొన్ని చోట్ల గృహ నిర్మాణాల శంఖుస్థాపన పనులకు ఎదురౌతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడారు. త్వరితగతిన ఇళ్ళ శంఖుస్థాపన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ళ పునాదుల కార్యక్రమం పూర్తి కాగానే లబ్దిదారుల ఖాతాల్లో తొలివిడత నగదు జమ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా పేదల కోసం నిర్మిస్తున్న కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్, ఏ.పి ఫైబర్ నెట్ వంటి మౌళిక వసతుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం వలన గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పనులు చేసుకునే వారికి త్వరితగతిన నగదు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని చోట్ల ఉపాధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. గ్రామ సచివాలయాల భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో నాడు – నేడు పధకం ద్వారా అమలు అవుతున్న పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలపై తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ, అర్బన్ పరిధిలో ఇళ్ళ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన విచారణ నిర్వహించి అర్హత ఆధారంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్రా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపధ్యంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన జిల్లా కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలో వాలంటీర్ పోస్టులు ఖాళీగా వున్న చోట్ల వెంటనే భర్తీ చేయాలన్నారు.
సంయుక్త కలెక్టర్ ( రైతు బరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్.దినేష్ కుమార్ జిల్లా వ్యాప్తంగా 67 వేల మంది ఇళ్ళ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని జిల్లా కలెక్టర్ కు వివరించారు. కొన్ని చోట్ల లబ్దిదారుల జాబితాలు పెండింగ్ లో వున్నాయని, వాటిపై త్వరితగతిన విచారణ నిర్వహించి అర్హులైన వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే లబ్దిదారుల జాబితా ఆధారంగా ఇళ్ళ పట్టాలను సిద్దం చేశామని, త్వరలో వాటిని లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఖాళీగా వున్న ఇళ్ళ స్థలాలలో లబ్దిదారులకు పట్టాలు కేటాయించే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు.
సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివద్ధి) పి ప్రశాంతి కోవిడ్ థర్డ్ వేవ్ వుంటుందన్న నేపధ్యంలో పటిష్టమైన ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ప్రధానంగా పీ హెచ్ సీ లలో నాడు – నేడు పధకం ద్వారా భారీ మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ఆసుపత్రులలో తగిన సిబ్బంది, మౌళిక వసతులతో పాటు, చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పట్టణాలలో అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15 వ తేదిన ప్రారంభం కానున్న వాహన మిత్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
సంయుక్త కలెక్టర్ ( ఆసరా,సంక్షేమం) శ్రీధర్ రెడ్డి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం అమలు అవుతున్న తీరును జిల్లా కలెక్టర్ కు వివరించారు. కొన్ని మండలాల్లో ఉపాధి హామీ పధకం వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులను సమన్వయ పరచుకుని పని చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ వైఎస్సార్ క్లినిక్స్ కేంద్రాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక కారణాల వలన ఈ భవనాల నిర్మాణాలు చేపట్టలేక పోయామని, జూలై 2 వ తేది నాటికి భవన నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయాన్ని సంబంధిత శాఖల అధికారులకు వివరించారు.
సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ డి ఓ లు, పంచాయితీ రాజ్, హౌసింగ్, పబ్లిక్ హెల్త్, విద్యుత్, ఏ.పి ఫైబర్, తహసీల్దార్లు, యంపిడిఓ లు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.