టీమ్ వర్క్ తో రాష్ట్రస్థాయి గుర్తింపు..


Ens Balu
4
Anantapur
2021-06-11 16:58:37

అనంతపురంలో జిల్లా అధికారులందరూ టీం వర్క్ తో పనిచేసి రాష్ట్ర స్థాయిలో అనంత జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను కోరారు.. శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, డాక్టర్ ఏ. సిరి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ లతో కలిసి జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా అధికారులందరూ టీం వర్క్ తో పని చేసి రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.అలాగే జిల్లా కలెక్టర్ చే నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. 
వివిధ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు, ఇతర అంశాలకు సంబంధించి కోర్టుల నుండి నోటీసులు అందిన మొదటి రోజు నుంచే దానిపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించాల్సి ఉందన్నారు. ప్రతి శాఖకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటారు కనుక ,వారి తరఫున ఆయా శాఖలకు సంబంధించిన కేసులో జిల్లా అధికారులే ఎప్పటికప్పుడు సకాలంలో కోర్టుకు పూర్తి వివరాలు సమర్పించాలన్నారు.అప్పుడే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టరేట్ లో ఒక సెట్ అప్ ను ఏర్పాటు చేసుకోవాలని  డిఆర్వో గాయత్రీ దేవి కి కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.