వేక్సినేషన్ లో అనంత ముందుండాలి..


Ens Balu
0
Anantapur
2021-06-12 15:33:12

అనంతపురం  జిల్లాలోని వైద్య రంగానికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు.  శనివారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు కోవిడ్ స్ట్రాటెజిక్ ప్లానింగ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా నిర్వహించి రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచేవిధంగా పనిచేయాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని, అదే సమయంలో వేగంగా ఫలితాలు వెల్లడి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య రంగంలో ఉన్న పలు శాఖలకు చెందిన డీఎంహెచ్ఓ, సీసీజీహెచ్, సూపర్ స్పెషాలిటీ, సీసీహెచ్ వంటి అధికారులందరూ సమన్వయంతో పని చేసి కోవిడ్ ను కట్టడి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న టీకాలు ఎప్పటికప్పుడు పంపిణీ  చెయ్యాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను సందర్శించాలన్నారు. కరోనా పరీక్షల నమూనాలను గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సేకరించాలని ఆదేశించారు. కోవిడ్ మూడో వేవ్ రూపంలో మరో సారి విజృంభించినా సిద్ధంగా ఉండాలని నోడల్ అధికారులు, వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. 

వ్యాక్సినేషన్ విధానంలో చేసిన మార్పులకు అనుగుణంగా జిల్లాలో వయస్సుతో నిమిత్తం లేకుండా అయిదేళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేయాలన్నారు. ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకాలు వేసే ప్రక్రియ పకడ్బందీగా సాగాలన్నారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. రోగి హోమ్ ఐసోలేషన్ ఉన్న సమయంలో ఉదయం 8 గంటల నుండి ప్రతి 4 గంటలకు ఒకసారి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, జ్వరం, శ్వాస ప్రక్రియ, పల్స్ రేటు , బిపి, మరియు ఆక్సిజన్ స్థాయిలను గమనించి వాటి విలువలు చార్ట్ రూపంలో నమోదు చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, తాత్కాలిక ఆసుపత్రులు, మెడికల్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలు-సరఫరా గురించి కలెక్టర్ ఆరా తీశారు. ప్రస్తుతం జిల్లాలోని కోవిడ్ కేసులు, మరణాలు , వ్యాక్సినేషన్, హోమ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఫీవర్ సర్వే లపై డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్ ,సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, కోవిడ్ నోడల్ ఆఫీసర్ లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.