ప్రతి ఒక్కరూ సంకల్పంతో పని చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించదలచిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, చెత్తలేని చూడచక్కని గ్రామాలను తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కార్యాచరణ, లక్ష్యాలను వివరించేందుకు పంచాయతీ రాజ్ మంత్రి సోమవారం రాష్ట్రంలోని వివిధ గ్రామాల సర్పంచులతో దూరదృశ్య సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో స్వర్గీయ దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు నుంచి చేపట్టబోయే ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయటం ద్వారా విజయవంతం చేయాలని సూచించారు. మూడు దశల్లో జరిగే ఈ క్రతువులో గ్రామాల రూపు రేఖలను మార్చాలని పేర్కొన్నారు. సర్పంచులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని, అప్పడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. సర్పంచులు స్వచ్ఛ సంకల్పం రథసారథులని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. జూలై 8వ తారీఖు నుంచి 100 రోజులు చేపట్టే ఈ మహోన్నత కార్యక్రమ ఉద్దేశాలను, లక్ష్యాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. మంత్రితో పాటు పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జి.కె. ద్వివేది సమావేశంలో పాల్గొన్నారు.
ముందుగా పలువురు సర్పంచులతో మాట్లాడి వారి అభిప్రాయాలను మంత్రి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా నుంచి జొన్నవలస సర్పంచ్ కంది రమాదేవి మంత్రితో మాట్లాడారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చేపట్టబోయే పనుల గురించి తీసుకునే చర్యల గురించి వివరించారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, పారిశుద్ధ్య రహిత గ్రామంగా తీర్చుదిద్దుతానని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తానని తెలిపారు. అనంతరం జిల్లాలో 100 రోజుల పాటు చేపట్టబోయే కార్యక్రమాల గురించి జిల్లా పరిషత్ సీఈవో టి. వెంకటేశ్వరరావు వివరించారు. జిల్లా నుంచి కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవోతో పాటు డీపీవో సుభాషిణి, జిల్లా కో-ఆర్డినేటర్ సత్యన్నారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.