ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలను లక్ష్యాలకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, ఇందుకోసం జూన్ 17 నుంచి జులై 2వ తేదీ వరకు నిర్వహించనున్న భవన నిర్మాణ పక్షోత్సవాలను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లకు శాశ్వత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు జిల్లాస్థాయిలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనుసంధానంతో గ్రామ సచివాలయాల నిర్మాణాలు జూన్ 30 నాటికి, ఆర్‌బీకేలను జులై 8 నాటికి, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలను జులై 31 నాటికి, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (తొలిదశ)ను జూన్ 30 నాటికి పూర్తిచేయాల్సి ఉందన్నారు. దాదాపు రూ.వెయ్యి కోట్లతో 4,492 భవ నిర్మాణాలకు అనుమతులు మంజూరుకాగా వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తికాగా మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జేసీ (ఆసరా) నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీ, ఎంపీడీవో/పీవో, ఈజీఎస్ నేతృత్వంలో మండలస్థాయి కమిటీ, పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-1) నేతృత్వంలో గ్రామస్థాయి కమిటీలు నిర్మాణ పనుల సత్వర పూర్తికి కృషిచేస్తాయని వివరించారు. శాశ్వత భవనాల నిర్మాణాలకు సంబంధించి మెటీరియల్, లేబర్ తదితరాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయి అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. గ్రామస్థాయి కమిటీలు రోజువారీ ప్రగతిని నమోదుచేసి, ఎప్పటికప్పుడు మండలస్థాయి కమిటీలకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా మడలస్థాయి కమిటీలు గ్రామాల్లో సందర్శించి.. ప్రజాప్రతినిధులు, సిబ్బందితో సమావేశమై పనుల పూర్తికి కృషిచేయడంతో పాటు ప్రగతి నివేదికలను నిర్దేశ ఫార్మాట్లలో జిల్లాస్థాయి అధికారులకు పంపాల్సి ఉంటుందని, అదే విధంగా మొబైల్ యాప్‌లో ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను భాగస్వాములను చేయడం ద్వారా నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. వివిధ స్థాయుల్లో సమస్యల పరిష్కారానికి, మార్గనిర్దేశనానికి జిల్లాస్థాయిలో ప్రత్యేక కాల్‌సెంటర్ కూడా పనిచేస్తుందని వెల్లడించారు. జిల్లాస్థాయి కమిటీ క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్ఈ బీఎస్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డీడీ ఎస్.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.