సమిష్టి కృషితో గృహనిర్మాణాలు పూర్తి..


Ens Balu
3
శ్రీకాకుళం
2021-06-14 16:34:26

శ్రీకాకుళం జిల్లాలోని జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ నారాయణ్ భరత్ గుప్త ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 741 లేఅవుట్లు ఉన్నాయని, వాటిని వచ్చే మార్చి నాటికి అన్ని హంగులతో పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. ఇందుకు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో ముందుకుసాగాలని దిశా నిర్ధేశం చేశారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల సమిష్టి కృషితోనే గృహనిర్మాణాలు సకాలంలో పూర్తికాగలవని ఆయన అభిప్రాయపడ్డారు. గృహనిర్మాణాలకు అవసరమైన సామాగ్రి, ఇతరత్రా ఏర్పాట్లను ఎప్పటికపుడు సరిచూసుకుంటూ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. గృహనిర్మాణాలను పూర్తిచేయడంలో ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయ సహకారాలను అందించడానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులకు గుర్తుచేసారు. ఎట్టిపరిస్థితిల్లోనూ మొదటి దశలో జిల్లాకు కేటాయించిన  90 వేల 716 గృహాలు అనుకున్న సమయానికి పూర్తికావాలని, ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మ ఆర్థికంగా పరిపుష్టి చెందాలనేదే ముఖ్యమంత్రి ఆశయమని, ఆయన ఆశయసాధనకు ప్రతీ అధికారి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో ప్రోగ్రెస్ తక్కువగా ఉన్న మండలాలు, గ్రామాలపై అధికారులు ముందుగా దృష్టిసారించాలని, ప్రతీ రోజూ గృహనిర్మాణాల పనితీరుపై జె.సి(హౌసింగ్) సమీక్షిస్తారని, ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే జె.సి దృష్టికి తీసుకురావాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ లేనివిధంగా గృహనిర్మాణ శాఖపై నమ్మకం ఉంచారని, అందువలన ప్రతీ అధికారి కలిసికట్టుగా పనిచేసి శాఖకు మంచిపేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

          ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ మరియు మౌళికవసతుల కల్పన ఓ.ఎస్.డి యం.ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో మొదటివిడతలో 742 లేఅవుట్లకు గాను 658 లేఅవుట్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలియజేసినట్లు చెప్పారు. ఈ లేఅవుట్లలో గృహనిర్మాణాలతో పాటు సి.సి.రోడ్లు, 1500 కంటే ఎక్కువ గృహాలు ఉన్నచోట అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, 1500 కంటే తక్కువ గృహాలు కలిగినచోట ఓపెన్ డ్రైనేజీలను ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. అలాగే 550 కంటే ఎక్కువ గృహాలు ఉన్నచోట అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, లేనిచోట ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ సిస్టంను ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రిసిటీతో పాటు ఏ.పి.ఫైబర్ నెట్ కూడా ఉంటుందని, వీటితో పాటు పార్కులు, ఇతరత్రా వసతులు కూడా కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. వీటికి సంబంధించి ఆయా శాఖల ద్వారా డి.పి.ఆర్ లను కోరడం జరిగిందని, కొన్ని శాఖలు ఇప్పటికే డి.పి.ఆర్ లు అందజేసాయన్నారు. ఇంజినీరింగ్ అధికారులు రోజువారీ ప్రోగ్రెస్ వివరాలను ఎప్పటికపుడు ఆన్ లైన్ నందు నమోదుచేయాలని కోరారు.

          ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖ సంయుక్త సంచాలకులు హిమాంశు కౌశిక్, చీఫ్ ఇంజినీర్ పి.శ్రీరాములు, పథక సంచాలకులు టి.వేణుగోపాల్, ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.